Rahul Gandhi: సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంపై రాహుల్ గాంధీ స్పందన

Rahul Gandhi Surat wordplay after BJP wins Lok Sabha seat in Gujarat unopposed

  • సూరత్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి
  • కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి నామినేషన్ కూడా తిరస్కరణ
  • ఇదీ నియంత నిజమైన ముఖమంటూ రాహుల్ గాంధీ స్పందన

సూరత్ లోక్ సభ నియోజకవర్గం ఏకగ్రీవం కావడంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆ పార్టీ డమ్మీ అభ్యర్థి సురేశ్ నామినేషన్‌ను కూడా తిరస్కరించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవమయ్యారు. ఈ అంశంపై రాహుల్ స్పందించారు. ఇదీ నియంత నిజమైన ముఖం అంటూ విమర్శించారు.

ప్రాథమికంగా ప్రతిపాదకుల సంతకంలో వ్యత్యాసాలను గుర్తించడంతో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను జిల్లా రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో నియంత నిజ స్వరూపం... మరోసారి దేశం ముందు వెల్లడైందంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

'దేశం ముందు మరోసారి నియంత అసలు 'ముఖం' బయటపడింది. ప్రజానాయకుడిని ఎన్నుకునే హక్కును హరించివేయడం ద్వారా... బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడంలో మరో అడుగు వేశారు. అందుకే మరోసారి చెబుతున్నాను... ఇది కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎన్నికలు కాదు, దేశాన్ని రక్షించే ఎన్నికలు, రాజ్యాంగాన్ని పరిరక్షించే ఎన్నికలు' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మరోవైపు, సూరత్‌లో తమ అభ్యర్థుల నామినేషన్‌ను తిరస్కరించడంపై కోర్టుకు వెళతామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. సూరత్ గెలుపు మ్యాచ్ ఫిక్సింగ్ అని విమర్శించింది.

  • Loading...

More Telugu News