YS Sharmila: వైఎస్సార్ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తే... అదే బీజేపీని జగన్ ముద్దాడని రోజే లేదు: షర్మిల
- బాపట్ల జిల్లా అద్దంకిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ
- చంద్రబాబు, జగన్ బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారన్న షర్మిల
- పార్లమెంటులో బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకు జగన్ మద్దతిచ్చాడని విమర్శలు
ఏపీ విషయంలో ఒక్క మాట కూడా నిలబెట్టుకోని బీజేపీ పార్టీకి ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ గులాంగిరీ చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా అద్దంకిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తే, ఆయన కొడుకై ఉండి జగన్ మోహన్ రెడ్డి బీజేపీని ముద్దాడని రోజు లేదు అని ఘాటుగా విమర్శించారు. పార్లమెంటులో ఏ బిల్లు ప్రవేశపెట్టినా జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇచ్చాడని షర్మిల స్పష్టం చేశారు.
"ఏ అవసరం వచ్చినా, బీజేపీ వాళ్లు ఏ ప్రాజెక్టు అడిగినా దాన్ని రాసిచ్చేశాడు... ఆఖరికి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా కాజేసే ప్రయత్నం చేస్తుంటే ఎప్పుడు అడ్డుకున్నాడు ఈ జగన్ మోహన్ రెడ్డి? మణిపూర్ లో దారుణమైన రీతిలో క్రైస్తవుల ఊచకోత జరుగుతుంటే అక్కడ కూడా జగన్ అడ్డుకోలేదు. మరి కొడుకై ఉండి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను జగన్ ఎలా నిలబెట్టినట్టు?
రాజశేఖర్ రెడ్డి రైతును నెత్తినపెట్టుకున్నారు, రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ అయింది, మద్దతు ధర ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు, ఇన్ పుట్ సబ్సిడీ, ఎరువులపై సబ్సిడీ, విత్తనాలపై సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ, పంట నష్టపరిహారం, వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ... రాజశేఖర్ రెడ్డి ఇలా అన్ని చేశారు కదా! జలయజ్ఞం చేశారు.
అదే తండ్రికి కొడుకై ఉండి జగన్ ఏంచేశారు? రాష్ట్రంలో పంటకు మద్దతు ధర ఉందా? పొలంలో డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ పై సబ్సిడీ ఉందా? యంత్రాలపై సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పరిహారం ఉందా? రైతన్న వాడికి గౌరవం ఉందా? రైతులు మొత్తం అప్పులపాలు కాలేదా? అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడంలేదు.
గతంలో ఎన్నికలప్పుడు జగన్ మైక్ పట్టుకుని... నాకు ఓటేయండి, గెలిచాక రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. రూ.3 వేల కోట్లు పక్కనబెట్టి, రైతు అన్న వాడు పంటను నష్టానికి అమ్ముకునే అవసరమే లేకుండా చేస్తానని చెప్పాడు. మరి ఒక్క సంవత్సరం అయినా జగన్ రైతుల కోసం రూ.3 వేల కోట్లు పక్కనబెట్టాడా?
పంట నష్టపోతే సాయం చేయడానికి రూ.4 వేల కోట్లు పక్కనబెడతానన్నాడు.... ఏం చేశాడు? పంట నష్టపోయిన ఒక్కరికైనా సాయం చేశాడా?" అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.