CM Ramesh: అమిత్ షాకు అన్నీ తెలుసు... అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయం: సీఎం రమేశ్
- వైసీపీ వాళ్లు తప్పులు చేస్తూ బీజేపీకి ఆపాదిస్తున్నారన్న రమేశ్
- ఆ రోజు జనాన్ని రప్పించి ఆసుపత్రి చుట్టూ కూర్చోబెట్టి అవినాశ్ అరెస్ట్ ను అడ్డుకున్నారని వెల్లడి
- అవినాశ్ అరెస్ట్ కు సమయం రావాలని వ్యాఖ్యలు
అనకాపల్లి లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఓ చానల్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లు అనేక తప్పులు చేస్తూ, కేంద్రంలో ఉన్న వారికి చెప్పే చేశామని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో ఇలా జరుగుతోందని తాను పార్టీ పెద్దలకు స్పష్టమైన సమాచారం అందించానని సీఎం రమేశ్ వెల్లడించారు.
వీళ్లు చేసే తప్పులన్నీ బీజేపీకి ఆపాదిస్తున్నారని, బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి వీళ్లు కాల్చుతున్నారని సీఎం రమేశ్ మండిపడ్డారు. ఏపీ అధికార పక్షం వైఖరిని తిప్పికొట్టేందుకు తాము ప్రయత్నించామని అన్నారు. ఏడాది క్రితం తిరుపతిలో జేపీ నడ్డా , వైజాగ్ లో అమిత్ షా కూడా సీఎం జగన్ అవినీతిపరుడు అని స్పష్టంగా విమర్శలు చేశారని వివరించారు.
"అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ రాష్ట్రానికి వచ్చినప్పుడు... రాయలసీమలోని ఇతర ప్రాంతాలనుంచి జనాన్ని రప్పించి ఆసుపత్రి చుట్టూ కూర్చోబెట్టి అరెస్ట్ ను అడ్డుకున్నారు. ఆ రోజు అరెస్ట్ కాకుండా పోవచ్చేమో కానీ, అవినాశ్ రెడ్డి అనే వాడు కచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఇందులో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.
అమిత్ షాకు అన్నీ తెలుసు... ఏడాదిన్నర కిందటే ఆయన నాతో చెప్పాడు. స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నందున సీబీఐ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పాడు. అయితే అతడి అరెస్ట్ కు సమయం రావాలి. ఎందుకంటే ఇందులో కోర్టులతో కొన్ని విషయాలు ముడిపడి ఉన్నాయి. అతడు అరెస్ట్ అవడం మాత్రం ఖాయం, దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో కూడా బయటికి వస్తారు" అని సీఎం రమేశ్ వివరించారు.