Supreme Court: దివ్యాంగ చిన్నారుల తల్లులకు శిశు సంరక్షణ సెలవులు నిరాకరించలేం: సుప్రీంకోర్టు
- అలా నిరాకరించడం ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యతను ఉల్లంఘించడమే అవుతుందన్న సుప్రీం
- ఆదర్శ యజమానిగా ప్రభుత్వం ఈ విషయాన్ని మరువరాదని వ్యాఖ్య
- శిశు సంరక్షణ సెలవులు కోరిన పిటిషనర్ కు మంజూరు చేయాలని ఆదేశం
దివ్యాంగ చిన్నారుల ఆలనాపాలన చూసుకుంటూ ఉద్యోగం చేసే తల్లులకు శిశు సంరక్షణ సెలవుల (సీసీఎల్)ను నిరాకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా సెలవులు నిరాకరించడం ఉద్యోగాల్లో మహిళల సమాన భాగస్వామ్యం ఉండేలా చూడాలన్న ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యతను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ విషయం తీవ్రమైన అంశాన్ని లేవనెత్తిందని పేర్కొంది. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం హోదా కాదని.. అది రాజ్యాంగ అవసరమని అభిప్రాయపడింది. ఒక ఆదర్శ యజమానిగా ప్రభుత్వం ఈ విషయాన్ని మరువరాదని సూచించింది. హిమాచల్ ప్రదేశ్ లోని జియోగ్రఫీ (భూభౌగోళిక) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న పిటిషనర్ కు సీసీఎల్ లను మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలని రాష్ర్ట ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలాలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.
దివ్యాంగ చిన్నారులున్న మహిళా ఉద్యోగులకు సీసీఎల్ ల మంజూరు విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకొనేందుకు హిమాచల్ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించిన సుప్రీం ధర్మాసనం.. ఈ విషయంలో కోర్టుకు సహాయకారి (అమికస్ క్యూరీ)గా ఉండాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని కోరింది. ఆ మహిళా ఉద్యోగి కుమారుడు జన్యు లోపంతో బాధపడుతుండటంతో పుట్టినప్పటి నుంచి ఆమె ఎన్నో సర్జరీలు చేయించింది. కుమారుడి చికిత్స కోసం ప్రభుత్వం మంజూరు చేసిన, కేంద్ర సివిల్ సర్వీసుల నిబంధనల ప్రకారం లభించే సీసీఎల్ లను పూర్తిగా వాడేసింది.
“ఉద్యోగాల్లో మహిళలకు సమాన అవకాశాలను నిరాకరించరాదనే కీలక రాజ్యాంగ బాధ్యతను శిశు సంరక్షణ సెలవు నెరవేరుస్తుంది. అలాంటి సెలవులను నిరాకరించడం ఉద్యోగం చేసే తల్లి దాన్ని వదులుకొనేలా ఒత్తిడి తెస్తుంది. ప్రత్యేక అవసరాలున్న చిన్నారి కోసం తల్లి ఉద్యోగం చేయడం ఎంతో ముఖ్యం. అంతిమంగా పిటిషనర్ వినతి విధానపరమైన అంశాలను స్పృశిస్తోంది. అయితే ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ పరిరక్షణలకు లోబడి ఉండాలి” అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.