Jagan: జగన్ బస్సు యాత్ర ఒక చరిత్ర: ఎమ్మెల్సీ తలశిల రఘురాం
- జగన్ గ్రాఫ్ ఎంత పెరిగిందో బస్సు యాత్ర ద్వారా అర్థమవుతోందన్న రఘురాం
- చంద్రబాబు సభలకు జనాలే రావడం లేదని ఎద్దేవా
- ఎన్నికల తర్వాత ఏపీలో ప్రతిపక్షాలు ఉండవని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వైసీపీ శ్రేణులు, అభిమానులు చూపిస్తున్న ఆదరణపై వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం స్పందించారు. ఈ అంశంపై నేడు ఆయన మాట్లాడుతూ... ఇప్పటి వరకు బస్సు యాత్ర 2100 కిలోమీటర్ల మేర కొనసాగిందని చెప్పారు. జగన్ పై హత్యాయత్నం జరిగినా వెనక్కి తగ్గలేదని అన్నారు. ప్రజల్లో జగన్ గ్రాఫ్ ఎంత పెరిగిందో బస్సు యాత్ర ద్వారా అర్థమవుతోందని, జగన్ బస్సు యాత్ర దేశంలోనే ఒక చరిత్ర అని ఆయన చెప్పారు.
ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రఘురాం విమర్శలు గుప్పించారు. పగటి పూట కూడా సభలు పెట్టలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. జనం రాక చంద్రబాబు బస్సులో గంటల సేపు కూర్చుంటున్నారని అన్నారు. విజయవాడ, విశాఖ రోడ్ షోలతో జగన్ ప్రభంజనం ఎలా ఉండబోతోందో అర్థమయిందని చెప్పారు.
జలుబు, దగ్గు వచ్చినా హైదరాబాద్ కు వెళ్లిపోయే పవన్ కల్యాణ్ కు జగన్ ను విమర్శించేంత అర్హత లేదని ఆయన అన్నారు. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ను ఖరారు చేస్తామని... బస్సు యాత్ర కంటే వినూత్నంగా ప్రచార సభలు ఉంటాయని చెప్పారు. ఎన్నికల తర్వాత ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు అడ్రస్ ఉండదని అన్నారు.