Smriti Irani: రాహుల్ ఇప్పుడు ఏంచేస్తారో మరి!: స్మృతి ఇరానీ ఎద్దేవా
- అమేథి నియోజకవర్గంపై రాహుల్ గాంధీ బావ కన్నేశారన్న స్మృతి ఇరానీ
- సీటు కోసం రాహుల్ కర్చీఫ్ వేయాలని చురక
- పోలింగ్‌కు 27 రోజులే ఉంది... అయినా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదని ఎద్దేవా
అమేథి నియోజకవర్గంపై రాహుల్ గాంధీ బావ (రాబర్ట్ వాద్రా) కన్నేశారని, మరి ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత ఏం చేస్తారో చూడాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఒకప్పుడు ప్రజలు బస్సుల్లో సీట్ల కోసం కిందనుంచే కర్చీఫ్ వేసేవారని... ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా తన సీటును బుక్ చేసుకోవడానికి అలాగే చేయాలేమోనని చురక అంటించారు.
అమేథి స్థానం నుంచి 2019లో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించారు. ఆమె ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. దీనిపై కేంద్రమంత్రి స్పందించారు. పోలింగ్‌కు మరో 27 రోజులే ఉందని... కానీ అమేథి నుంచి ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదని విమర్శించారు. ఇది వారి అహంకారానికి నిదర్శనమన్నారు. ఇటీవల రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ... అమేథి ప్రజలు తన ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారని, ఇక్కడ తన అభ్యర్థిత్వంపై సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.