Pawan Kalyan: మే 1న పెన్షన్ ఇంటివద్దకే ఇవ్వకపోతే వైసీపీ కుట్ర ఉన్నట్టే: పవన్ కల్యాణ్
- పిఠాపురంలో నామినేషన్ వేసిన జనసేనాని
- ఈసారి పెన్షన్ ఇళ్ల వద్దకే తెచ్చివ్వాలని పవన్ డిమాండ్
- టీడీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి కోసం నిలబడ్డామని వెల్లడి
- త్వరలో జరిగే ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా
ఈసారి పెన్షన్ ను ఇళ్ల వద్దకే తెచ్చి ఇవ్వాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మే 1న పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వకపోతే అందులో వైసీపీ కుట్ర ఉన్నట్టేనని అన్నారు. ఈసారి ఎన్నికలు విజన్ 2047 దృష్ట్యా, భవిష్యత్ తరానికి కూడా కీలకమేనని పవన్ స్పష్టం చేశారు.
"ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ మూడు పార్టీలు చేయి కలిపి ముందుకెళుతున్నాయి. జనసేన పార్టీ బలం పుంజుకున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గాం, త్యాగాలు చేశాం. టీడీపీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి కోసం నిలబడ్డాం. ఎస్వీఎస్ఎన్ వర్మ గారు నాకోసం తన సీటును త్యాగం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వ్యక్తిగత ప్రయోజనాలు దాటి రాష్ట్రం కోసం చేస్తున్న త్యాగం ఇది. భవిష్యత్తులో ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తున్నాం.
త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించబోతోంది. ఇవాళ నా నామినేషన్ కు వచ్చిన స్పందనే అందుకు నిదర్శనం. ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నలిపేసిందో ఆ మీడియాకు మేం అండగా ఉంటాం. మీ కష్టాల్లో మేం పాలుపంచుకుంటాం" అంటూ పవన్ కల్యాణ్ భరోసానిచ్చారు.