Love Brain: వైద్య చరిత్రలో సరికొత్త వ్యాధి.. ‘లవ్ బ్రెయిన్’తో బాధపడుతున్న 18 ఏళ్ల అమ్మాయి.. వ్యాధి లక్షణాలు ఇవే!
- బాయ్‌ఫ్రెండ్ పేరును రోజుకు వందసార్లకు పైగా పలవరిస్తున్న షావోయు
- దయనీయంగా మారిన మానసిక పరిస్థితి
- బాయ్‌ఫ్రెండ్‌పై ఎక్కువగా ఆధారపడుతూ, అన్ని వేళలా అతడి అవసరాన్ని పెంచుకున్న యువతి
- స్పందించకుంటే ఇంట్లోని సామాన్లు విసిరికొడుతూ నానా హంగామా
- బాల్యంలో తల్లిదండ్రులతో ఆరోగ్యకరమైన సంబంధాలు లేకుంటే ఇలాగే ఉంటుందన్న వైద్యులు
- వైద్య పరిభాషలోనే పేరులేని వ్యాధిగా గుర్తింపు
బాల్యంలో తల్లిదండ్రులతో సఖ్యత, ఆరోగ్యకరమైన సంబంధం ఎంత అవసరమో చెప్పే ఘటన ఇది. బాయ్‌ఫ్రెండ్‌పై అవసరానికి మించి ఆధారపడడం, అతడి అవసరాన్ని పెంచేసుకోవడం, అతడు స్పందించకుంటే తీవ్రంగా స్పందించడం వంటి కారణాలు 18 ఏళ్ల చైనా యువతిని వైద్య పరిభాషలోనే లేని సరికొత్త వ్యాధివైపు నడిపించాయి. రోజుకు 100 సార్లకుపైగా బాయ్‌ఫ్రెండ్ పేరును పలవరిస్తూ ఆమె ‘లవ్ బ్రెయిన్’ అనే సరికొత్త వ్యాధికి గురైంది. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్సుకు చెందిన బాధితురాలి పేరు షావోయు. ప్రియురాలి మానసిక ప్రవర్తన ఆమె ప్రియుడిని దయనీయంగా మార్చిందని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ నివేదించింది.
యూనివర్సిటీలో చదువుతుండగా షావోయూ ప్రియుడితో రిలేషన్షిప్ పెట్టుకుంది. ఆ తర్వాత ఆమెలో అసాధారణ మార్పు మొదలైనట్టు చెంగ్డులోని ఫోర్త్ పీపుల్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రియురాలు తనపై ఎక్కువగా ఆధారపడడం, అన్నివేళల్లో ఆమెకు తన అవసరం పెరిగిపోవడంతో అతడు కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు.
పదేపదే మెసేజ్‌లు
బాయ్‌ఫ్రెండ్ కనిపించకుంటే ఆగమాగం అయిపోవడం, ఎక్కడ ఉన్నావో చెప్పాలంటూ ఆగకుండా మెసేజ్‌లు చేయడం, తాను ఎప్పుడు మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇవ్వాలంటూ బలవంతం చేయడం వంటివి ఆమెలోని మానసిక స్థితికి అద్దం పడుతున్నాయని వైద్యుడు డు నా తెలిపారు. సామాజిక మాధ్యమం ‘వియ్‌చాట్’ కెమెరా ఆన్‌చేసి పదేపదే మెసేజ్‌లు చేస్తున్న వీడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. అయినప్పటికీ అతడు స్పందించకపోవడం, ఒకే రోజు వందసార్లకుపైగా కాల్ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో ఆమె పరిస్థితి దిగజారింది. దీంతో ఆమె మానసికంగా కలత చెంది ఇంట్లోని వస్తువులను విసిరికొట్టడం, పగలగొట్టడం చేసేది. దీంతో ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, బాల్కనీ నుంచి దూకుతానని ఆమె బెదిరించింది.
తల్లిదండ్రులతో సంబంధాలు లేకుంటే
షావోయు బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. దీనిని ‘లవ్ బ్రెయిన్’గా పేర్కొంటున్నారు. నిజానికి ఇది అధికారిక వైద్య పరిభాష కాదు. ఆందోళన, కుంగుబాటు, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక అనారోగ్యంతో ఇది కలిసి ఉంటుందని వైద్యుడు డు నా తెలిపారు. బాల్యంలో తల్లిదండ్రులతో ఆరోగ్యకరమైన సంబంధం లేని వ్యక్తుల్లో ఇలాంటి తరచుగా సంభవించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తీవ్ర లక్షణాలతో బాధపడే వారికి వైద్య సాయం అవసరమని పేర్కొన్నారు.
నా క్కూడా ఉందా ఏంటి?
ఈ కథనానికి 84 వేలమందికిపైగా స్పందించారు. ఆమె తిరిగి మామూలు మనిషి అవుతుందా? అని ఒకరు.. నేను కూడా ఆమెలానే ప్రవర్తిస్తున్నాను, నాక్కూడా ‘లవ్ బ్రెయిన్’ ఉందా? అని మరొకరు కామెంట్ చేశారు. కాగా, ఈ ‘లవ్ బ్రెయిన్’ వ్యాధి అనేది 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసు వారికి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.