Resume Flags: రెజ్యుమె లో ఈ తప్పులు చేయొద్దు.. గూగుల్ మాజీ హెచ్చార్ సూచనలు

Ex Google Recruiter Reveals Resume Red Flags Shares 3 Phrases To Avoid

  • కుప్పలు తెప్పలుగా వచ్చే రెజ్యుమెలలో ప్రత్యేకంగా ఉండాలని సలహా
  • ముఖ్యంగా మూడు పొరపాట్లు అస్సలు చేయకూడదన్న మాజీ రిక్రూటర్
  • క్లుప్తంగా, విషయానికి పరిమితమయ్యేలా ఉండాలని సూచన

ఉద్యోగం సాధించడంలో రెజ్యుమె పాత్ర ఎంత కీలకమో తెలిసిందే.. అలాంటి రెజ్యుమె తయారీలో చాలామంది చేసే తప్పులను గూగుల్ మాజీ హెచ్చార్ ఉద్యోగి ఒకరు వివరించారు. ముఖ్యంగా మూడు తప్పులు దొర్లకుండా రెజ్యుమె తయారుచేస్తే ఉద్యోగం సాధించడంలో మొదటి మెట్టు ఎక్కేయవచ్చని సూచించారు. గూగుల్ కంపెనీలో రిక్రూటర్ గా తనకున్న అనుభవం, తాను చూసిన రెజ్యుమెల గురించి నోలన్ చర్చ్ వివరించారు.

ప్రస్తుత ప్రపంచంలో ఉద్యోగాలకూ విపరీతమైన పోటీ నెలకొంది. మంచి కంపెనీ జాబ్ నోటిఫికేషన్ కు వందలు, వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. వేలాదిగా వచ్చే రెజ్యుమెలను పరిశీలించేందుకు హెచ్చార్ సిబ్బందికి చాలా తక్కువ సమయమే ఉంటుందని నోలన్ గుర్తుచేశారు. కుప్పలు తెప్పలుగా ఉన్న రెజ్యుమెల నుంచి ప్రత్యేకంగా కనిపించిన వాటిని, సూటిగా స్పష్టంగా ఉన్న వాటిని పక్కనపెట్టి మిగతా వాటిని చెత్తబుట్టలోకి పంపించేస్తామని తెలిపారు. ఏ కంపెనీలోనైనా హెచ్చార్ సిబ్బంది చేసే పని ఇదేనని వెల్లడించారు. సగటున ఒక రెజ్యుమెను ప్రాసెస్ చేయడానికి హెచ్చార్ సిబ్బంది వెచ్చించే సమయం 3 నుంచి 5 సెకండ్లు మాత్రమేనని తెలిపారు. మీరు పంపే రెజ్యుమె చెత్తబుట్టలోకి కాకుండా ఇంటర్వ్యూ కాల్ లిస్ట్ లోకి చేరాలంటే ముఖ్యంగా మూడు తప్పులు చేయకూడదని నోలన్ చర్చ్ చెప్పారు.. 

అవేంటంటే..
1) వాక్య నిర్మాణం మరీ పెద్దగా ఉండకూడదు. ఏ వాక్యమూ 25 పదాలకు మించవద్దు. పదాలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.
2) జాబ్ నోటిఫికేషన్ లో పేర్కొన్న కీ వర్డ్స్ (అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, లక్షణాలు, సామర్థ్యం) లను ఒకే వాక్యంలో ఇరికించకూడదు. కీ వర్డ్స్ తో పారాగ్రాఫ్ మొత్తం నింపెయ్యడమూ సరికాదు. బుల్లెట్ పాయింట్లతో ఒక్కో కీ వర్డ్ ను ఒక్కో వాక్యంలో ఉపయోగించడం మంచిది.
3) గతంలో మీరు చేసిన టాస్క్ లలో ప్రస్తుత కంపెనీకి ఉపయోగపడేవి మాత్రమే రెజ్యుమెలో మెన్షన్ చేయాలి. పాత కంపెనీలో మీరు సాధించిన గోల్స్.. కంపెనీకి లాభం చేకూర్చిన వాటిని (ఉదాహరణకు టార్గెట్ ను మించి సేల్స్ చేయడం, కొత్త క్లెయింట్లను తీసుకురావడం వంటివి) మాత్రమే వివరించాలి. మిగతా టాస్క్ ల గురించి హెచ్చార్ లు పట్టించుకోరు.. పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు.. అంటూ నోలన్ చర్చ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News