Devineni Uma: భూభక్షా పథకంతో రైతుల మెడకు జగన్ ఉరితాళ్లు: దేవినేని ఉమామహేశ్వరరావు
- రెవెన్యూ రికార్డులు సైతం తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపణ
- ఉద్దేశపూర్వకంగా నల్లచట్టాలు తీసుకొచ్చారని ఆగ్రహం
- చంద్రబాబు వీడియోను షేర్ చేసిన టీడీపీ నేత
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మరోమారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల భూములపై జగన్ కత్తి వేలాడుతోందని హెచ్చరించారు. భూభక్షా పథకం పేరుతో సామాన్యుడిని దోచుకుంటున్నారని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులు సైతం తప్పుల తడకగా ఉన్నాయని, న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా నల్లచట్టాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రజల ఆస్తుల పత్రాలపై మీ బొమ్మలేంటని ప్రశ్నించారు. భూ యాజమాన్యం చట్టం రైతుల మెడలకు జగన్ ఉరితాడు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ చంద్రబాబు మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.
ఓ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ఇవ్వని భూములపై ఆయన ఫొటో ఏంటని మండిపడ్డారు. వారసత్వంగా వస్తున్న భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడం ఏంటని నిలదీశారు. నిద్ర లేవగానే ఆ సైకో బొమ్మను మీరు చూడాలా? అని ప్రశ్నించారు. జగన్ భూమి ఇస్తే ఆయన బొమ్మ వేసుకోవచ్చని, కానీ మీ నాన్న, మా తాత, మీ ముత్తాత ఇస్తే దానిపై ఈ సైకో ఫొటో ఏంటని మండిపడ్డారు. పొలాల్లోనూ ఆయన ఫొటో వేస్తారని, ఇంటికిపోయినా, పొలానికి పోయినా ఆయన ఫొటోనే చూస్తూ మీరు భయపడుతూ ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు.