jogi: అగ్రవర్ణాలన్నీ జగన్ కే మద్దతు ఇస్తున్నాయి: జోగి రమేశ్
- రాష్ట్ర ఓటర్లను ఒక ఎన్నారై 'వెధవలు' అన్నాడన్న జోగి రమేశ్
- ఎన్నారైలు జగన్ వైపు ఉండాలని సూచన
- కుప్పంలో చంద్రబాబు గెలవడం కూడా డౌటేనని వ్యాఖ్య
ఎన్నారైలు రాష్ట్రం కోసం స్వచ్ఛందంగా సేవ చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని ఏపీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. కండకావరంతో టీడీపీకి సపోర్ట్ చేసే ఒక ఎన్నారై రాష్ట్ర ఓటర్లను వెధవలు అన్నాడని మండిపడ్డారు. ఎవరు మంచి చేస్తున్నారో ఎన్నారైలు ఆలోచించుకోవాలని... మంచి చేస్తున్న జగన్ వైపే ఎన్నారైలు ఉండాలని చెప్పారు. ఎన్నారైలు చంద్రబాబును నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేనని అన్నారు.
ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి జగన్ సీఎం కాబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు టీడీపీ శ్రేణులు యత్నిస్తున్నాయని... అలాంటి ఆలోచనలు మానుకోవాలని సూచించారు. 2019 ఎన్నికల్లో ఓట్లు వేయనివారు కూడా ఈ ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా నిలబడుతున్నారని చెప్పారు. అగ్రవర్ణాలన్నీ జగన్ కు మద్దతిస్తున్నాయని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గెలుస్తాడో, లేదో అనేది పెద్ద డౌట్ అని చెప్పారు. అన్ని సర్వేలు వైసీపీదే విజయమని చెపుతున్నాయని తెలిపారు.