KTR: బీజేపీని ఓడించే దమ్ములేకే రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తున్నారు: కేటీఆర్ ఎద్దేవా
- బీజేపీని అడ్డుకునే శక్తి కేవలం బీఆర్ఎస్కే ఉందన్న కేటీఆర్
- బీజేపీని ఓడించే దమ్ములేని కాంగ్రెస్కు ఓటేసి వృథా చేసుకోవద్దని హితవు
- బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అయితే కవిత జైల్లో ఎందుకు ఉంటారని ప్రశ్న
అమేథిలో బీజేపీని ఓడించే దమ్ములేక రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కానీ తెలంగాణలో బీజేపీ దిగ్గజాలను ఓడించిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. మల్కాజ్గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ... బీజేపీని అడ్డుకునే దమ్ము కేవలం మన పార్టీకే ఉందన్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ బీజేపీని అడ్డుకున్నది బీఆర్ఎస్సే అన్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు వంటి నేతలను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది ఎవరు? బీఆర్ఎస్ అభ్యర్థులే ఓడించారన్నారు.
బీజేపీని ఓడించే దమ్ములేని కాంగ్రెస్కు ఓటు వేసి వృథా చేసుకోవద్దని సూచించారు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అయితే కేసీఆర్ కూతురు జైల్లో ఉండేవారా? తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదని... ఈసారి కూడా ఓటేస్తే మొత్తం పథకాలను బంద్ చేస్తారని విమర్శించారు. ఏమీ చేయకపోయినా సరే ఓట్లు వేశారంటూ అన్ని పథకాలను ఆపేస్తారన్నారు. కాంగ్రెస్ చెప్పిన అన్ని పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.
గత పదేళ్లలో హైదరాబాద్కు, బీజేపీకి తెలంగాణ చేసిందేమీ లేదన్నారు. ఉప్పల్, అంబర్పేట్లో పదేళ్లలో రెండు ఫ్లై ఓవర్లు కూడా కట్టలేకపోతున్నారని మండిపడ్డారు. కానీ ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 36 ఫ్లై ఓవర్లు కడితే రెండు కూడా కట్టడం చేతకాని బీజేపీకి ఓట్లు అడిగేందుకు సిగ్గుందా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వచ్చాక గ్యాస్ సహా అన్నింటి ధరలు పెరిగాయన్నారు. బీజేపీకి మేలు చేసేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని ఆరోపించారు. అందుకే మోదీని రేవంత్ రెడ్డి బడేభాయ్ అన్నారని గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ ఏమో ప్రధాని మోదీని చౌకిదార్ చోర్ హై అంటాడని... రేవంత్ రెడ్డిమో మోదీ హమారా బడే భాయ్ అంటారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కాం లేదంటాడు... కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమంటాడు... కానీ ఇక్కడ రేవంత్ రెడ్డేమో అదే లిక్కర్ స్కాంలో కవితమ్మ అరెస్ట్ కరెక్టే అంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోసం పని చేస్తున్నారా? లేక మోదీ కోసం చేస్తున్నారా? అని నిలదీశారు.
కేసీఆర్ లేకపోవడంతో తెలంగాణ ఆగమైందని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చర్చ జరుగుతోందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నిన్న ఇంటర్వ్యూలో అన్ని అనుమానాలకు సమాధానం చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి బక్వాస్ ప్రచారాలను తిప్పి కొట్టారన్నారు. బీఆర్ఎస్ పది స్థానాల్లో గెలిస్తే కేసీఆరే దేశ రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందన్నారు. తమకు 400 సీట్లు వస్తాయని బీజేపీ చెబుతోందని.. కానీ వారు పోటీ చేస్తోందే 420 సీట్లలో అని గుర్తించాలన్నారు. ఎన్డీయే కూటమికి 200, ఇండియా కూటమికి 150 సీట్లు దాటవన్నారు. అప్పుడు వారు బీఆర్ఎస్ను బతిమాలే పరిస్థితి వస్తుందన్నారు.