K Kavitha: కవితకు 33 శాతం వాటా కోసం అతను పని చేశాడు... వాట్సాప్ చాట్ ఆధారాలున్నాయి: కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ వాదనలు
- మనీలాండరింగ్ కేసులో చాలామంది నిందితులకు బెయిల్ రాలేదన్న ఈడీ
- మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను అన్ని కోర్టులు తిరస్కరించాయని వెల్లడి
- మద్యం వ్యాపారం అంశంపై కవితను కలవమని మాగుంటకు కేజ్రీవాల్ చెప్పారన్న ఈడీ
- రూ.50 కోట్లు ఇవ్వాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కవిత చెప్పారన్న ఈడీ
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో మూడోరోజైన బుధవారం విచారణ జరిగింది. ఈడీ వాదనలు వినిపిస్తూ... మనీలాండరింగ్ కేసులో చాలామంది నిందితులకు ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ తిరస్కరించాయని పేర్కొంది. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను అన్ని కోర్టులు తిరస్కరించాయన్నారు. ఈడీ తరఫున జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు.
సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్ట్ చేశామని... అక్రమంగా అరెస్ట్ చేశారనే వాదనలో పసలేదని ఈడీ పేర్కొంది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని... హోల్ సేల్ వ్యాపారులు వందల కోట్లు సంపాదించారని... కమీషన్‌ను ఐదు నుంచి 12 శాతానికి పెంచారని పేర్కొంది. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు మద్యం వినియోగదారులకు నష్టం జరిగిందని తెలిపింది. ఈ పాలసీలో ఇండో స్పిరిట్‌కు మేజర్ షేర్ దక్కిందని... దీని ద్వారా అక్రమాలు జరిగాయని కోర్టుకు వివరించింది. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని ఆరోపించింది.
విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపినట్లు తెలిపింది. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని, అసాధారణ లాభాలు గడించారని పేర్కొంది. అంతకుముందు డిస్ట్రిబ్యూటర్‌ను బలవంతంగా పక్కకు తప్పించినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ అంశంలో కేజ్రీవాల్‌ను మొదట కలిసింది మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని పేర్కొంది.
సౌత్ నుంచి కొందరు వ్యాపారం చేయడానికి ముందుకొచ్చారని ఈడీ పేర్కొంది. అయితే కవితను కలవమని మాగుంట శ్రీనివాసులురెడ్డికి కేజ్రీవాల్ చెప్పారని వెల్లడించింది. కేజ్రీవాల్ తనను రూ.100 కోట్లు అడిగినట్లు కవితకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారని... అయితే రూ.50 కోట్లు ఇవ్వాలని కవిత అడిగారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబుకు... రాఘవ రూ.25 కోట్లు ఇచ్చారని తెలిపింది. వాదనల సందర్భంగా బుచ్చిబాబు చాట్‌లను కోర్టులో ఈడీ న్యాయవాది ప్రస్తావించారు.
మద్యం వ్యాపారంలో కవితకు 33 శాతం వాటా కోసం బుచ్చిబాబు పని చేశారని... ముడుపుల ద్వారా ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత భాగస్వామ్యం పొందారని మాగుంట రాఘవ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపింది. మాగుంట రాఘవ సిబ్బంది గోపీకుమార్ రూ.25 కోట్లను రెండు విడతలుగా బుచ్చిబాబు, బోయినపల్లికి ఇచ్చినట్లు వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది. కవితను శరత్‌చంద్రా రెడ్డి హైదరాబాద్‌లో కలిశారని... ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులో శరత్‌చంద్రా రెడ్డి కొంత మొత్తాన్ని ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది.