KCR: నన్ను చర్లపల్లి జైల్లో వేస్తామని అంటున్నారు.. నేను భయపడతానా?: కేసీఆర్

KCR road Show in Miryalagua

  • మిర్యాలగూడ రోడ్డు షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత
  • పేగులు మెడలో వేసుకుంటాం... గుడ్లు పీకుతాం... ఇదేనా సీఎం మాట్లాడే భాష అని ఆగ్రహం
  • మనం మళ్లీ అధికారంలోకి వస్తాం... ఇందులో అనుమానం లేదన్న కేసీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఆయన మిర్యాలగూడలో మాట్లాడుతూ... తెలంగాణలో తన ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెబుతున్నారని... చర్లపల్లి జైల్లో వేస్తామని అంటున్నారని... అలాంటి వాటికి నేను భయపడతానా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేనేళ్లు కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నామని... అలాంటి తనను జైల్లో వేస్తామంటున్నారని వాపోయారు. పేగులు తీసి మెడలో వేసుకుంటాం... గుడ్లు పీకి గోళీలు ఆడుతాం... ఇదేనా? ముఖ్యమంత్రి మాట్లాడే భాష అని ధ్వజమెత్తారు.

ప్రజలు ఆలోచన చేసి ఓటేయాలని కోరారు. అన్నీ అబద్దాలు చెబుతూ.. అబద్దపు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్ పుణ్యమా అని మనకు తెలంగాణ వచ్చిందని... అందుకే ఆయన గౌరవార్థం అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. మొన్న అంబేడ్కర్ జయంతి రోజున అక్కడకు ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ వెళ్లలేదని మండిపడ్డారు. మనం తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని... ఎలాంటి అనుమానం లేదన్నారు. మనల్ని ఎవరూ ఆపలేరన్నారు. మనం కలగన్న బంగారు తెలంగాణ నిర్మాణమయ్యేదాకా కొట్లాడుదామన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఎక్కువ సీట్లలో గెలిపిస్తే అది తెలంగాణ ప్రజల బలం అవుతుందన్నారు. మీ తరఫున ప్రభుత్వాల మెడలు వంచగలుగుతామన్నారు. మే 13వ తేదీ వరకు ఇదే ఉత్సాహం కొనసాగించి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిస్తే తెలంగాణలో భూమి ఆకాశం ఒకటి చేసినంత పోరాటం చేస్తానన్నారు. మీరిచ్చే బలంతో కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పోరాటం చేయగలుగుతుందన్నారు.

బీఆర్ఎస్ హయాంలో రెప్పపాటు కూడా విద్యుత్ పోలేదన్నారు. ఇంకా మిగులు విద్యుత్ ఉండేలా చూశామని తెలిపారు. మిషన్ భగీరథను ఇప్పుడు సరిగ్గా నడపలేని పరిస్థితి నెలకొందన్నారు. రైతుబంధు గురించి అడిగితే చెప్పుతో కొడతానని మంత్రి చెప్పడం విడ్డూరమన్నారు. చెప్పులు కేవలం మంత్రుల వద్దనే కాదు... రైతుల వద్ద కూడా ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని ఆరోపించారు. రైతుబంధులో దగా చేశారని, రైతుబీమా ఉంటుందో ఊడుతుందో తెలియదన్నారు.

  • Loading...

More Telugu News