Chandrababu: విజయనగరం సభలో చంద్రబాబు, పవన్ ప్రసంగం హైలైట్స్
- ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు
- కూటమి అభ్యర్థుల కోసం కలిసి ప్రచారం చేస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
- ఇవాళ నెల్లిమర్ల, విజయనగరంలో సభలు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ విజయనగరంలో కూటమి తరఫున ఉమ్మడి ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ... జగన్ ను ఓడించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కూటమి సభలకు జనం పోటెత్తుతుండడమే అందుకు నిదర్శనమని అన్నారు.
మందు, బిర్యానీ, డబ్బు ఇస్తున్నా జగన్ మీటింగ్ లు జనం లేక వెలవెలబోతున్నాయని, కానీ కూటమి సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని, ఎక్కడ సభ పెట్టినా మన మీటింగ్ లు కళకళ అంటూ హర్షం వెలిబుచ్చారు. కూటమి సభలకు వస్తున్న స్పందన చూసి వైపీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని స్పష్టం చేశారు.
ఎన్నికలు వస్తే చాలు... జగన్ శవాలతో, శవరాజకీయాలతో వస్తున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ ఒక్క చాన్స్ అంటూ వచ్చాడని, ఆ చాన్స్ అయిపోయిందని స్పష్టం చేశారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన సంగతి స్పష్టంగా కనిపిస్తోందని, ఈసారి ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతేనని అన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని చంద్రబాబు ఉద్ఘాటించారు.
పవన్ కల్యాణ్ ఒక మంచి వ్యక్తి... ఆయన ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు... నిస్వార్థంగా నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. 45 ఏళ్లుగా ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని చూడలేదని, నాడు అశోక్ గజపతిరాజును ఎలా వేధించారో మీరందరూ చూశారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
గతంలో నేను తలుచుకుని ఉంటే జగన్ జైలు నుంచి బయటికి వచ్చేవారా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక విధ్వంసక పాలనతో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల కోసం జగన్ ఎంత ఖర్చు పెట్టారు? అని నిలదీశారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలనే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిశాయని చంద్రబాబు వివరించారు. యువత భవిష్యత్తుకు తాను హామీగా ఉంటానని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పారు.
అధికారంలోకి వచ్చాక ఏం చేయబోతున్నామో... రేపో, ఎల్లుండో చెబుతామని... అవసరమైతే మేనిఫెస్టోలో మరికొన్ని అంశాలు చేర్చుతామని చంద్రబాబు వెల్లడించారు. జగన్ ఇది క్లాస్ వార్ అంటున్నాడని, కానీ ఇది క్లాస్ వార్ కాదని క్యాష్ వార్ అని అభివర్ణించారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు దోచుకున్నది మొత్తం కక్కిస్తామని స్పష్టం చేశారు.
జగన్ అనే గూండాను బంగాళాఖాతంలో కలిపేయొచ్చు: పవన్ కల్యాణ్
జనసేనాని పవన్ కల్యాణ్ విజయనగరం సభలో ప్రసంగిస్తూ... ఇవాళ విజయనగరంలో అడుగుపెట్టగానే విజయం ఖాయమని అర్థమైందని అన్నారు. వైసీపీ అవినీతి కోటను ఈ ఎన్నికల్లో బద్దలు కొట్టబోతున్నాం అని సమరశంఖం పూరించారు. విజయనగరం సభ చూసి జగన్ కు వెన్నులో చలి వస్తుంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు.
చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు రాష్ట్రానికి అవసరం అని అన్నారు. జైలులో పెట్టినా చంద్రబాబులో ఏ మాత్రం ధైర్యం తగ్గలేదని, తాను జైలుకు వెళ్లి చూసినప్పుడు చంద్రబాబు ఎంతో నిబ్బరంగా కనిపించారని పవన్ కల్యాణ్ కొనియాడారు. రాజకీయ పోరాటం చేయడమే చంద్రబాబుకు తెలుసని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎవరూ ఆనందంగా ఉండడం జగన్ కు ఇష్టం లేదని విమర్శించారు. యువత మార్పు కావాలని బలంగా కోరుకుంటోందని తెలిపారు. విద్య, వైద్యం, ఉద్యోగం కావాలని యువత ఆశిస్తోందని పేర్కొన్నారు. అన్నింటిలోనూ రాష్ట్రం వెనుకంజలో ఉందని అన్నారు. ఒక్క గంజాయిలో మాత్రమే రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.
ప్రజల భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకే తాము కలిశామని అన్నారు. కళ్లెదుట తప్పులు జరుగుతున్నప్పుడు తాను చూస్తూ ఊరుకోలేనని, తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో ఓటు చీలకుండా ఉంటే జగన్ అనే గూండాను బంగాళాఖాతంలో కలిపేయొచ్చని పిలుపునిచ్చారు.