Tide Survey: 95 శాతం మంది భారత మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన లేమి!
- భారత్లోని మహిళా వ్యాపారస్తులపై బ్రిటన్ సంస్థ టైడ్ సర్వే
- టైర్-2 నగరాల్లో 1200 మందిపై అధ్యయనం
- ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన లేదన్న 95 శాతం మంది మహిళలు
- మహిళల్లో 52 శాతం మందికి రుణ లభ్యత
భారత్లో మహిళా వ్యాపారస్తులకు అప్పు పుట్టడం కష్టమేనని యూకేకు చెందిన బిజినెస్ ప్లాట్ఫాం టైడ్ తేల్చింది. ఈ మేరకు భారత మహిళా వ్యాపారవేత్తల అనుభవాలపై ఓ సర్వేను విడుదల చేసింది. దేశంలో టైర్-2 నగరాల్లోని 1200 మంది కొత్త, పాత బిజినెస్ ఓనర్లపై సర్వే ఆధారంగా భారత్ విమెన్ ఆస్పిరేషన్ ఇండెక్స్ రూపొందించింది.
సర్వే ప్రకారం, 95 మంది మహిళలు తమ వ్యాపారాలకు లాభించే ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన లేదన్నారు. 52 శాతం మంది తమకు రుణ లభ్యత ఉన్నట్టు తెలిపారు. వ్యాపారాల నిర్వహణకు డిజిటల్ నైపుణ్యాలు అవసరమని సర్వేలో పాల్గొన్న 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే, 51 శాతం మంది మాత్రం తాము డిజిటల్ ఉత్పత్తుల లభ్యత, వినియోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.
రుణ లభ్యత, మార్గదర్శకత్వం, డిజిటల్ ఉత్పత్తులు వంటివన్నీ వ్యాపారం విజయవంతమయ్యేందుకు కీలకమని టైడ్ ఇండియా సీఈఓ గురుజోధ్పాల్ సింగ్ తెలిపారు. మహిళా వ్యాపారుల్లో దాదాపు సగం మందికి రుణ సదుపాయం అందుబాటులో ఉన్నా, ఆర్థికాంశాలపై అవగాహనాలేమి ఉందని పేర్కొన్నారు.