Supreme Court: ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం తీసేసుకోవచ్చా?.. సుప్రీంకోర్టు ఏమందంటే..!

Can Private Property Be Taken Over For Common Good

  • ప్రైవేటు ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించలేరనడం ప్రమాదకరమన్న సుప్రీం
  • గనులు, ప్రైవేటు అడవులను ఉదాహరణగా ప్రస్తావించిన సీజేఐ ధర్మాసనం
  • ఒక ఆస్తి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాక ఆర్టికల్ 39 వర్తించదని అనలేమని వ్యాఖ్య

ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రైవేటు ఆస్తిని స్వాధీనం చేసుకోకూడదనే వాదన సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక ఆస్తి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాక ఇక ఆర్టికల్ 39 బి వర్తించదని చెప్పలేమంటూ వ్యాఖ్యానించింది. ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించకూడదనడం ప్రమాదకరమని పేర్కొంది. సమాజ సంక్షేమం కోసం సంపద పునఃపంపిణీ జరగాల్సిందేనని వెల్లడించింది. ఈమేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. 

 ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించొచ్చా అన్న అంశంపై బుధవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ముంబైకి చెందిన ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ (పీవోఏ) తో పాటు పలువురు పిటిషన్ దారుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 (బి), 31 (సి) ను ఉదహరిస్తూ.. ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని వాదించారు. అయితే, సుప్రీం ధర్మాసనం ఈ వాదనలతో విభేదిస్తూ.. ‘ప్రభుత్వ వనరులను మాత్రమే సమాజ వనరులని, ప్రైవేటు వనరులను ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదని అనలేం.. ప్రైవేటు గనులు, ప్రైవేటు అడవుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదనడం తగదు’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జమీందారీ వ్యవస్థ రద్దును ప్రధాన న్యాయమూర్తి ఉదహరించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 బి ప్రస్తావనలో రాజ్యాంగం రచించిన నాటి సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగ ఉద్దేశం సమాజంలో పరివర్తన తీసుకురావడమేనని గుర్తుచేసింది. సమాజ సంక్షేమానికి సంపద పున:పంపిణీ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక, శిథిలావస్థకు చేరిన భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం కల్పిస్తున్న మహారాష్ట్ర చట్టం చెల్లుబాటుపై విడిగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది.

  • Loading...

More Telugu News