Inheritance Tax: వారసత్వ పన్ను చట్టం మన దేశంలోనూ ఉండేది.. ఎందుకు రద్దు చేశారంటే..!

India Had Its Own Inheritance Tax Till 1985

  • ఎస్టేట్ డ్యూటీ ట్యాక్స్ పేరుతో వసూలు
  • 1985లో రద్దు చేసిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం
  • పన్ను వసూళ్ల కంటే ఖర్చే ఎక్కువని ఆరోపణ

కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వారసత్వ పన్ను వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. అమెరికాలో ప్రస్తుతం అమలవుతున్న వారసత్వ పన్ను విధానాన్ని శామ్ పిట్రోడా మెచ్చుకున్నారు. అమెరికాలో పేరెంట్స్ మరణానంతరం వారసులు పొందే ఆస్తిపై ప్రభుత్వం పన్ను విధిస్తుంది. ఆస్తి విలువలో 55 శాతం ప్రభుత్వం తీసేసుకుంటుంది. మిగతా 45 శాతం మాత్రమే వారసులకు దక్కుతుందని చెప్పారు. సమాజం కోసం ఇలాంటి పన్ను వ్యవస్థల అవసరం ఎంతైనా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ నేపథ్యంలో భారత దేశంలోనూ ఇలాంటి వారసత్వ పన్ను గతంలో అమలులో ఉండేదని నిపుణులు చెబుతున్నారు. ఎస్టేట్ డ్యూటీ యాక్ట్ 1953 చాలాకాలం అమలైంది. అయితే, 1985లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసింది. పన్ను వసూళ్లకంటే, వారసుల నుంచి వసూలు చేయడానికి అయ్యే ఖర్చులు, కోర్టు లిటిగేషన్ల చికాకుల నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి వీపీ సింగ్ బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించారు.

ఎస్టేట్ డ్యూటీ ట్యాక్స్..
తల్లిదండ్రులు, ఇతరత్రా బంధువుల మరణానంతరం వారసత్వంగా పొందే ఆస్తులపై విధించే పన్నును ‘ఎస్టేట్ డ్యూటీ’ గా వ్యవహరించేవారు. చట్ట ప్రకారం రూ.1.5 లక్షలకు (అప్పటి విలువ ప్రకారం) మించిన ఆస్తులను వారసత్వంగా పొందినట్లయితే ఈ ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఓ వ్యక్తి మరణించినపుడు అతడి పేరు మీద ఉన్న ఆస్తుల విలువను మధించి, ఆ విలువ రూ.1.5 లక్షలకు పైన ఉంటే ఆస్తి విలువలో 7.5 శాతం పన్ను కింద అధికారులు వసూలు చేసేవారు. అయితే, చట్టంలోని పలు లొసుగులను వాడుకుంటూ చాలామంది పన్ను ఎగవేతకు పాల్పడేవారని ఆరోపణలు వచ్చాయి. పన్ను వసూళ్లకు అనేక లిటిగేషన్లు ఎదురవడంతో ఖర్చు పెరిగిపోయేది. తీరా చూస్తే వసూలైన సొమ్ముకంటే ప్రభుత్వానికయ్యే ఖర్చే ఎక్కువైందని తేలేది. ఈ ట్యాక్స్ తో ప్రభుత్వానికి సమకూరే మొత్తం చాలా తక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఎస్టేట్ డ్యూటీని రద్దు చేసింది.

  • Loading...

More Telugu News