Credit Cards: తెగ కొనేస్తున్నారు.. మార్చిలో క్రెడిట్ కార్డు ఖర్చు లక్షకోట్లు!
- ఎడాపెడా క్రెడిట్ కార్డులు జారీచేస్తున్న బ్యాంకులు
- మార్చిలో 10 కోట్లు దాటేసిన క్రెడిట్‌కార్డుల సంఖ్య
- గతేడాదితో పోలిస్తే 20 శాతానికిపైగా పెరిగిన కొనుగోళ్లు
- ఆఫ్‌లైన్ లావాదేవీలలోనూ రికార్డులే
- మొత్తం క్రెడిట్‌కార్డుల్లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డులదే మెజార్టీ వాటా
నిబంధనలు, క్రెడిట్ స్కోరు వంటివాటిని పట్టించుకోకుండా బ్యాంకులు ఎడాపెడా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తుండడంతో వినియోగదారులు కూడా ఎడాపెడా ఖర్చు పెట్టేస్తున్నారు. మార్చిలో ఏకంగా క్రెడిట్ కార్డు ఆన్‌లైన్ చెల్లింపులు ఏకంగా రూ. 1,04,081 కోట్లు దాటేశాయి. గతేడాది ఇదే నెలలో రూ. 86,390 కోట్లు ఖర్చు చేయగా, ఇప్పుడా ఖర్చు 20 శాతానికి పైగా పెరిగింది. ఫిబ్రవరిలో రూ. 94,774 కోట్లు ఖర్చు చేయగా మార్చిలో అది 10 శాతం పెరిగి రూ. 1,04,081 కోట్లకు చేరింది.
క్రెడిట్ కార్డు ఆఫ్‌లైన్ లావాదేవీలు (పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల ద్వారా) కూడా గతేడాదితో పోలిస్తే బాగా పెరిగాయి. నిరుడు ఇదే సమయంలో రూ. 50,920 కోట్లుగా ఉన్న ఆఫ్‌లైన్ లావాదేవీలు ఈసారి 19 శాతం పెరిగి రూ. 60,378 కోట్లకు చేరుకున్నాయి.
దేశంలోని క్రెడిట్ కార్డుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఫిబ్రవరిలో తొలిసారి 10 కోట్లు దాటేసి మార్చి నాటికి 10.2 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో దేశంలో 8.5 కోట్లు ఉండగా, ఇప్పుడది 20 శాతం పెరిగింది.
మొత్తం క్రెడిట్ కార్డుల్లో హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ వాటా 20.2 శాతం కాగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎస్‌బీఐ (18.5 శాతం), ఐసీఐసీఐ బ్యాంకు (16.6 శాతం), యాక్సిస్ బ్యాంక్ (14 శాతం) కోటక్ మహీంద్రా బ్యాంక్ (5.8 శాతం) టాప్-10లో ఉన్నాయి. మొత్తం మార్కెట్ వాటాలో ఇవి 90 శాతాన్ని ఆక్రమించాయి.