YSRCP: పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్
- పులివెందుల సీఎస్ ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జగన్
- త్వరలోనే ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామన్న సీఎం
- అండగా ఉన్న పులివెందుల అంటే తనకు ప్రాణమని వ్యాఖ్య
మేమంతా సిద్ధం బస్సుయాత్రను బుధవారంతో ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా గురువారం పులివెందులలో పర్యటించారు. అనంతరం అక్కడ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తొలుత పులివెందులలోని సీఎస్ ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం అక్కడ్నుంచి నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జగన్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను పులివెందుల ఆర్. ఓ కు అందజేశారు.
అంతకుముందు పులివెందులలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో బయటి ప్రపంచానికి తెలుసునన్నారు. వారితోనే తన చెల్లెళ్లు జతకట్టారని విమర్శించారు. అవినాశ్ ఏ తప్పూ చేయలేదు కాబట్టే మళ్లీ టికెట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు. అవినాశ్ జీవితాన్ని కొందరు నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అండ్ కో కూటమి తనపై దుష్ర్పచారం చేస్తున్నారని జగన్ అన్నారు.
కూటమి కుట్రల రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. పులివెందుల తనకు ఎంతో అండగా నిలిచిందని, పులివెందుల అంటే తనకు ప్రాణమని చెప్పారు. ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటును త్వరలోనే సాకారం చేస్తామని జగన్ పేర్కొన్నారు. సభ అనంతరం వైఎస్ జగన్ రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ ను దాఖలు చేశారు.