Rajnath singh: దేశంలో మతపరమైన రిజర్వేషన్లు తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తోంది: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్
- కాంగ్రెస్ మేనిఫెస్టోలో సచార్ కమిటీ ప్రతిపాదనలు రిఫరెన్స్ గా చూపించడమే అందుకు నిదర్శనమన్న కేంద్రమంత్రి
- మేనిఫెస్టోలో సెక్షన్ 3, 6 మైనార్టీ వర్గాల కోసమే ప్రత్యేకంగా కేటాయించారని విమర్శ
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నిపథ్ ను రద్దు చేస్తుందన్న రాజ్ నాథ్ సింగ్
త్రివిధ దళాలతోపాటు దేశంలోని అన్ని సంస్థల్లోనూ కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని చూస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్టణంలోని ఓ ఎన్నికల సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో చూస్తుంటే దేశంలోని అన్ని సంస్థల్లోనూ మతపరమైన రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని అర్థమవుతోందని చెప్పారు. మతపరమైన రిజర్వేషన్ల కోసం సచార్ కమిటీ నివేదికను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రిఫరెన్స్ చూపించడమే ఇందుకు నిదర్శనమన్నారు.
యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో దేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులను సచార్ కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పించిందని చెప్పారు. హిందువులు, ఇతర వెనుకబడిన కులాల కంటే కూడా దేశంలో ముస్లింలు బాగా వెనుకబడి ఉన్నట్లు, వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సచార్ కమిటీ నివేదికలో పేర్కొందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
తాజాగా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కూడా సచార్ కమిటీ నివేదికతో ప్రభావితమై తయారు చేసినట్లుగా ఉందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సెక్షన్ 3, 6 మైనార్టీ వర్గాల గురించే ప్రత్యేకంగా కేటాయించినట్లు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో మైనార్టీ వర్గాలను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతుందని మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
సెక్షన్ 6లో అయితే మైనారిటీ వర్గాలు విద్య, వైద్యం, ఉద్యోగాల్లో వారి మత వాటాను పొందుతారని కాంగ్రెస్ హామినిస్తున్నట్లుందని, దీని ప్రకారం దొడ్డిదారి ద్వారా అన్ని వ్యవస్థల్లోనూ, త్రివిధ దళాల్లోనూ మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తుందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లు అని కాంగ్రెస్ పార్టీ ఎక్కడా పేర్కొనకుండా తెలివిగా మేనిఫెస్టోను తయారు చేసిందన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని, ఇండియన్ ఆర్మీలో పాత రిక్రూట్ మెంట్ విధానాన్ని తిరిగి తీసుకొస్తామని ఆ పార్టీ చెప్పిందని రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేశారు.