Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా మొదలైన లోక్‌సభ రెండో దశ పోలింగ్.. సంపన్న అభ్యర్థుల జాబితా ఇదే
- 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 88 స్థానాలకు పోలింగ్
- 15.88 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు అవకాశం
- రూ.622 కోట్ల విలువైన ఆస్తితో రెండో దశలో అత్యంత సంపన్న అభ్యర్థిగా ఉన్న కర్ణాటక కాంగ్రెస్ నేత వెంకటరమణే గౌడ
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా రెండో దశ పోలింగ్ మొదలైంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ షురూ అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 1,202 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 15.88 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లలో 3 చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. నిజానికి రెండో దశలో 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ రీషెడ్యూల్ అయ్యింది. ఈ దశ ఎన్నికల్లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ నేత తేజస్వి సూర్య, హేమమాలిని, కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ఉన్నారు.
రెండో దశలో అత్యంత సంపన్నుల జాబితా..
ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) విశ్లేషణ ప్రకారం.. కర్ణాటక కాంగ్రెస్ నేత, మాండ్యా నుంచి పోటీ చేస్తున్న వెంకటరమణే గౌడ అత్యంత ధనవంతుడుగా ఉన్నారు. నామినేషన్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.622 కోట్లుగా ఉంది. ఇక కర్ణాటకలోనే కాంగ్రెస్ అభ్యర్థి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేశ్ ఆస్తుల విలువ రూ.593 కోట్లు. దీంతో అత్యంత సంపన్న అభ్యర్థుల్లో ఆయన రెండో స్థానంలో ఉన్నారు. బెంగళూరు రూరల్ నుంచి ఆయన బరిలో ఉన్నారు. ఇక మథుర లోక్‌సభ స్థానం నుంచి తిరిగి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ హేమమాలిని ఆస్తుల విలువ రూ.278 కోట్లు అని ప్రకటించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సంజయ్ శర్మ రూ.232 కోట్లతో నాలుగవ సంపన్న అభ్యర్థిగా ఉన్నారు. ఇక హెచ్డీ కుమారస్వామి రూ. 217.21 కోట్లతో ఐదవ స్థానంలో నిలిచారు.
పేద అభ్యర్థులు వీళ్లే..
మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన లక్ష్మణ్ నాగోరావ్ పాటిల్ అనే అభ్యర్థి తన ఆస్తుల విలువ కేవలం రూ.500 అని అఫిడవిట్లో పేర్కొన్నారు. కేరళలోని కాసరగోడ్ నుంచి మరొక స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వరి కేఆర్ తన ఆస్తుల విలువ రూ.1,000 మాత్రమే అని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న పృథ్వీసామ్రాట్ తన ఆస్తి విలువ రూ.1400 అని చెప్పారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న షహనాజ్ బానో అనే వ్యక్తి తన ఆస్తుల విలువ రూ.2000 అని, కేరళలోని కొట్టాయం నుంచి పోటీ చేసిన వీపీ కొచుమోన్ అనే అభ్యర్థి రూ.2,230 ఆస్తులను అఫిడవిట్లో పేర్కొన్నారు.