T20Is: ప్రపంచ క్రికెట్ చరిత్రలో సంచలన రికార్డు!
- బాలిలో ఇండోనేషియా, మంగోలియా మహిళల జట్ల మధ్య టీ20 మ్యాచ్
- ఒక్క పరుగు ఇవ్వకుండా ఏడు వికెట్లు పడగొట్టిన ఇండోనేషియా బౌలర్ రోహ్మాలియా
- తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన యువ స్పిన్నర్
- ఆమె ధాటికి 24 పరుగులకే కుప్పకూలిన మంగోలియా
- 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఇండోనేషియా
ప్రపంచ క్రికెట్ చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. ఇండోనేషియా, మంగోలియా మహిళల జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇండోనేషియా ప్లేయర్ రోహ్మాలియా చరిత్ర సృష్టించాడు. 3.2 ఓవర్లు బౌలింగ్ వేసిన 17 ఏళ్ల యువ ప్లేయర్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఆమె బౌలింగ్ కోటాలో మూడు ఓవర్లు మెయిడిన్ కావడం గమనార్హం. బాలిలో మంగోలియాతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఐదో టీ20 మ్యాచ్‌లో ఈ టీనేజ్ ఆఫ్ స్పిన్నర్ 20 బంతులు వేసి, ఏడుగురు బ్యాటర్లను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించి రికార్డు స్థాయి బౌలింగ్ గణాంకాలను నమోదు చేశారు.
ఆమె ధాటికి మంగోలియా కేవలం 24 పరుగులకే చాపచుట్టేసింది. అలాగే రోహ్మాలియాకు ఇదే అరంగేట్ర మ్యాచ్ కావడం విశేషం. ఇలా తన అరంగేట్రంలో ఆమె ఏడు వికెట్లు తీసి అన్ని (పురుషులు మరియు మహిళలు) టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశారు. ఇక మహిళల టీ20లో ఏడు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రోహ్మాలియా నిలిచారు. ఆమె కంటే ముందు ఈ ఫీట్‌ను అర్జెంటీనాకు చెందిన అలిసన్ స్టాక్స్ (7 వికెట్లకు 3 పరుగులు), నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రెడెరిక్ ఓవర్‌డిజ్క్ (7 వికెట్లకు 3 పరుగులు) ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో ఇండోనేషియా 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన ఈ ఐదో టీ20లో ఇండోనేషియా 151 పరుగులు చేసి మంగోలియాను 24 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇక గురువారం జరిగిన ఆరో టీ20లోనూ ఇండోనేషియా గెలవడంతో 6-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదిలాఉంటే.. పురుషుల టీ20లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు మలేషియాకు చెందిన స్యాజ్రుల్ ఈజత్ ఇదుర్స్ పేరిట ఉన్నాయి. గతేడాది చైనాతో జరిగిన మ్యాచ్‌లో అతడు 8 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.