Singapore Airlines: ఢిల్లీ విమానాశ్రయంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ పైలట్ అరెస్ట్.. వెలుగు చూసిన అసలు విషయం ఇదీ!
- ముంబైలో ఏడాది ఏవియేషన్ కోర్సు చేసిన సంగీత్ సింగ్
- సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నట్టు కుటుంబ సభ్యులు, స్నేహితులను నమ్మించిన వైనం
- ఆన్‌లైన్ యాప్ ద్వారా ఐడీకార్డు తయారుచేసి, ద్వారకలో యూనిఫాం కొనుగోలు
సింగపూర్ ఎయిర్‌లైన్స్ పైలట్‌గా పోజిచ్చిన 24 ఏళ్ల యువకుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పారామిలటరీ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంగీత్ సింగ్ సింగపూర్ పైలట్ యూనిఫాం ధరించి మెట్రో స్కైవాక్ ప్రాంతంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) బలగాల కంటపడ్డాడు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ పైలట్‌గా చెప్పుకునేందుకు మెడలో ఐడీకార్డు కూడా ధరించాడు.
అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడి ఐడీకార్డ్ సహా అంతా బోగస్ అని అధికారులు నిర్ధారించారు. ఆన్‌లైన్ యాప్ బిజినెస్ కార్డు మేకర్ ద్వారా సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఐడీని తయారుచేసుకున్నాడని, అనంతరం ద్వారకలో యూనిఫాం కొనుగోలు చేసినట్టు తేలింది.
సింగ్ 2020లో ముంబైలో ఏడాది ఏవియేషన్ హాస్పిటాలిటీ కోర్సు చేశాడని, తాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ పైలట్‌గా కుటుంబాన్ని, స్నేహితులను నమ్మించాడని పోలీసులు తెలిపారు. సింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.