vijay mallya: షరతుల్లేకుండా విజయ్ మాల్యాను అప్పగించాలని ఫ్రాన్స్ ను కోరిన భారత్

India Seeks Vijay Mallya Extradition From France Without PreConditions

  • నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా మాల్యా ఫ్రాన్స్ వస్తే తమకు అప్పగించాలని వినతి
  • రూ. 9 వేల కోట్లకుపైగా బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన మాల్యా
  • ఇప్పటికే భారత్ లోని ఆయన ఆస్తులను వేలంలో విక్రయించిన కేంద్ర ప్రభుత్వం
  • 2016 నుంచి యూకేలో నివసిస్తున్న లిక్కర్ టైకూన్

బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పరారైన లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాను స్వదేశం రప్పించేందుకు భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. 2016 నుంచి యూకేలో నివసిస్తున్న మాల్యాను భారత్ పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించింది. భారత్ లో ఆయనకు చెందిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించింది. 

వ్యవస్థీకృత నేరాలు, కౌంటర్ టెర్రరిజంపై ఉమ్మడి పోరులో భాగంగా ఫ్రాన్స్ తో ఇటీవల జరిగిన ద్వైపాక్షిక వర్కింగ్ గ్రూప్ 16వ సమావేశంలో భారత్ మాల్యా అప్పగింత అంశాన్ని ప్రస్తావించింది. విజయ్ మాల్యా ఒకవేళ ఫ్రాన్స్ కు వస్తే ఆయన్ను ఎలాంటి షరతులు లేకుండా తమకు అప్పగించాలని కోరింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించింది. 

ఆ వర్గాల సమాచారం ప్రకారం మాల్యా ఆస్తులు కూడబెట్టిన దేశాలు, నేరస్తుల అప్పగింతపై ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరిన దేశాలతో భారత్ ఆయన అప్పగింతకు ప్రయత్నాలు సాగిస్తోంది. దీనివల్ల ఒకవేళ మాల్యా ఆయా దేశాలకు ప్రయాణిస్తే ఆయన్ను భారత్ కు అప్పగించేందుకు వీలవుతుంది. కొన్ని షరతులతో మాల్యా అప్పగింతకు ఫ్రాన్స్ ప్రతిపాదించగా షరతుల్లేకుండానే అప్పగించాలని భారత్ కోరిందని ఆ వర్గాలు ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు వివరించాయి. 

భారత్–ఫ్రాన్స్ ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ సమావేశం గత వారం ఢిల్లీలో జరిగింది. భారత్ లో ఫ్రాన్స్ రాయబారి ఒలివర్ కారన్ ఫ్రాన్స్ బృందానికి నేతృత్వం వహించారు.

  • Loading...

More Telugu News