Botsa Satyanarayana: కేంద్రమంత్రి పియూష్ గోయల్ జాగ్రత్తగా మాట్లాడాలి: మంత్రి బొత్స
- నిన్న ఏపీకి వచ్చి చంద్రబాబును కలిసిన కేంద్రమంత్రి పియూష్ గోయల్
- విశాఖ రైల్వే జోన్ కు జగన్ ప్రభుత్వం భూమి కేటాయించలేదన్న గోయల్
- రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు అధికారులకు అప్పగించామన్న బొత్స
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ నిన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇచ్చిన నిధులను ఏపీలో దారిమళ్లించారని... ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియాతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ కు జగన్ ప్రభుత్వం భూమి కేటాయించలేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, కేంద్రమంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మంత్రి పదవి అనేది ఎంతో బాధ్యతాయుతమైనదని, పియూష్ గోయల్ ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని అన్నారు. ఇకపై ఆయన జాగ్రత్తగా మాట్లాడాలని కోరుతున్నామని తెలిపారు.
2014లో ఏపీలో ఓ దద్దమ్మ సీఎంగా ఉన్నారని, ఆ సమయంలో రైల్వేమంత్రిగా ఉన్న పియూష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదని బొత్స ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు అన్నీ అధిగమించి రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు అధికారులకు అప్పగించిందని స్పష్టం చేశారు.
2014 నుంచి 2019 వరకు కేంద్రంలో ఉన్నది సింగిల్ ఇంజిన్ ప్రభుత్వమేనా? మరో ఇంజిన్ ఎందుకు పనిచేయలేదు, రిపేర్ కు వచ్చిందా? అంటూ బొత్స బీజేపీ డబుల్ ఇంజిన్ నినాదాన్ని ఎత్తిపొడిచారు.