Nara Lokesh: అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తాం: నారా లోకేశ్
- మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
- నేడు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు
- తాను ఓడినప్పటికీ నియోజకవర్గంలో అనేక పనులు చేశానని లోకేశ్ వెల్లడి
- గెలిచినవాళ్లు పది శాతం పనులు కూడా చేయలేదని విమర్శలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, మంగళగిరి నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, తాను చేసిన సంక్షేమంలో 10 శాతమైనా గెలిచినవాళ్లు చేయగలిగారా? అని ప్రశ్నించారు.
కూటమి అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 2019 నుంచి అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవని నారా లోకేశ్ పేర్కొన్నారు. 2014లో అమరావతికి జగన్ సంపూర్ణ మద్దతు తెలిపారని, కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు.
జగన్ ను ఒప్పిస్తానన్న స్థానిక ఎమ్మెల్యే ఆర్కే కూడా మూడు రాజధానులకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ అండ్ కో మాస్టర్స్ డిగ్రీ చేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. దళిత రైతులపైనా అక్రమ కేసులు పెట్టారని లోకేశ్ విమర్శించారు.