Supreme Court: నోటా కంటే అభ్యర్థులకు తక్కువ ఓట్లు వస్తే... : పిటిషన్పై ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
- నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఆ నియోజకవర్గంలో ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని పిల్
- నోటా కంటే తక్కువ ఓట్లు వస్తే... ఆ అభ్యర్థులు పోటీ చేయకుండా నిబంధనలు రూపొందించాలని పిటిషన్
- పిటిషన్ దాఖలు చేసిన శివ్ ఖేరా అనే రచయిత
ఎన్నికల్లో నోటా కంటే అభ్యర్థులందరికీ తక్కువ ఓట్లు వస్తే ఆ ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు... ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. శివ్ ఖేరా అనే రచయిత ఈ పిటిషన్ను దాఖలు చేశారు. అతను లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు ఈసీకీ నోటీసులు జారీ చేసింది.
నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులు... తదుపరి ఐదు సంవత్సరాల్లో ఏ ఎన్నికలోనూ పోటీ చేయకుండా నిబంధనలు రూపొందించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా నోటాను కల్పిత అభ్యర్థిగా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలు రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే సమయంలో ఇటీవల సూరత్ లోక్ సభ ఏకగ్రీవం కావడాన్ని ప్రస్తావించారు. పిటిషనర్ చేసిన ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... ఈసీకి నోటీసులు పంపించింది. ఇది కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమని... ఈ అంశంపై ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దామని పేర్కొంది.