Mars: అంగారక గ్రహంపై 'సాలె పురుగులు'.. ఏమిటీ మిస్టరీ?
- ఫొటోలు తీసిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్
- మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింతగా ఆకారాలు
- 50 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకు విస్తీర్ణంలో ఏర్పాటు
మార్స్ పై స్పైడర్లు.. ఒకటీ రెండు కాదు కుప్పలు కుప్పలుగా.. నల్లటి సాలె పురుగుల్లాంటి ఆకారాలు.. అంగారకుడి చుట్టూ తిరుగుతున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)కి చెందిన ‘ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్’ ఉపగ్రహం తీసిన చిత్రాల్లో ఇవి కనిపించాయి. మరి ఏమిటా ఆకారాలు? వీటి గురించి శాస్త్రవేత్తలు ఏం తేల్చారో తెలుసుకుందామా..
అరుణ గ్రహం దక్షిణ ధ్రువ భాగంలో..
అంగారకుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఎప్పుడూ విపరీతంగా చల్లగా ఉంటుంది. అంతేగాకుండా అంగారకుడిపై కార్బన్ డయాక్సైడ్ శాతం చాలా ఎక్కువ. దక్షిణ ధ్రువ ప్రాంతంలో చల్లదనానికి కార్బన్ డయాక్సైడ్ మంచులా గడ్డకట్టి అక్కడి నేల పొరల దిగువన చేరుతుంది.
మార్స్ పై ఎండాకాలం రాగానే..
- అంగారకుడిపై ఎండాకాలం రాగానే.. అక్కడి నేల పొరల దిగువన ఉన్న కార్బన్ డయాక్సైడ్ వేడెక్కి గ్యాస్ గా మారుతుంది. ఈ గ్యాస్ ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా పేలిపోతుంది. దాంతో నేలలోని నల్లటి మట్టి ఎగిసిపడుతుంది. ఇలా సుమారు ఒక మీటర్ ఎత్తున నల్లటి మట్టి కుప్పలు ఏర్పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
- ఈ ఫొటోలో చూడటానికి చిన్నగా సాలె పురుగుల్లా కనిపిస్తున్నా.. ఆ ఆకారాలు సుమారు 50 మీటర్ల నుంచి కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంటాయని చెబుతున్నారు.
- అక్కడి అంతరిక్షంలోని ఉపగ్రహం నుంచి చిత్రాలు తీయడంతో ఇలా స్పైడర్ల గుంపులా కనిపిస్తున్నట్టు వివరిస్తున్నారు. నిజానికి అవి వేర్వేరు ఆకారాల్లో ఉన్నా.. మనకు స్పైడర్లలా దృష్టి భ్రమ కలుగుతుందని అంటున్నారు.
- ప్రతి సంవత్సరం అంగారకుడి వేసవి కాలంలో ఇలా ఏర్పడుతున్నట్టుగా గుర్తించామని చెబుతున్నారు.
- యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇటీవల ఏర్పడిన స్పైడర్ ఆకారాల ఫొటోలను తాజాగా విడుదల చేసింది.