Mudragada Padmanabham: డబ్బు కోసం సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చావా పవన్ కల్యాణ్?: ముద్రగడ పద్మనాభం
- ఉండిలో వైసీపీ కాపు కార్యకర్తలతో సమావేశం
- కాపు ఉద్యమాన్ని అణచిన చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారని విమర్శ
- పవన్ కు ఏ స్థాయి ఉందని ఆయన వద్దకు వెళ్లాలని ప్రశ్న
వైసీపీలో చేరినప్పటి నుంచి జనసేన అధినేత వపన్ కల్యాణ్ పై కాపు నేత ముద్రగడ పద్మనాభం పదునైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ... డబ్బుల కోసం సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చావా పవన్? అని ప్రశ్నించారు. కాపు ఉద్యమ సమయంలో ఘోరమైన అవమానాలను చంద్రబాబు చేశారని... కాపు ఉద్యమాన్ని అణచి వేసిన చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారని విమర్శించారు. తనను, తన భార్య, కోడలు, పిల్లలను 14 రోజులు జైల్లో మాదిరి బంధించారని మండిపడ్డారు. తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, వాష్ బేసిన్ లోని నీళ్లనే తాగామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉండిలో వైసీపీ కాపు కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముద్రగడ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నర్సింహరాజు హాజరయ్యారు.
తమ కుటుంబాన్ని చంద్రబాబు హింసిస్తుంటే... ఆయనను పవన్ కల్యాణ్ ఒక్కరోజు కూడా ప్రశ్నించలేదని ముద్రగడ విమర్శించారు. జగన్ పిలుపు మేరకు వైసీపీలో చేరిన తనను నానా బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులను తాను ఎందుకు ఫాలో అవ్వాలని ప్రశ్నించారు. ఏ స్థాయిలో ఉన్నావని నీ దగ్గరకు నేను రావాలని పవన్ ను ఉద్దేశించి అడిగారు. మీకొక ఎమ్మెల్యే అయినా ఉన్నాడా? అని ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా అయినా పోటీ చేస్తున్నావా? అని అడిగారు.