Revanth Reddy: ఏపీలో నష్టపోతామని తెలిసినా సోనియమ్మ తెలంగాణ ఇచ్చారు: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy praises Sonia Gandhi in Sangareddy sabha

  • సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రచార సభలో రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కార్యకర్తల కష్టం.. గొప్పతనమని వ్యాఖ్య
  • ఉద్యోగాలు వస్తాయని యువత ఉద్యమం చేసిందన్న రేవంత్ రెడ్డి
  • కానీ కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని విమర్శ
  • కేసీఆర్ చేతిలో తెలంగాణ తల్లి పదేళ్లు బలయిందని ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నష్టపోతామని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. సోనియమ్మ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత పదేళ్ల పాటు తెలంగాణ కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందన్నారు.

సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రచార సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే అది కార్యకర్తల కష్టం... గొప్పతనమే అని కొనియాడారు. భుజం కాయలు కాసేలా కార్యకర్తలు పార్టీ జెండాను మోశారన్నారు.

తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర యువత ఉద్యమం చేసిందన్నారు. కానీ పేదల ఉద్యోగాల గురించి ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. కుమారుడు, కూతురు, అల్లుడు, బంధువులకు మాత్రమే కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎల్బీ స్టేడియంలో 25వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామన్నారు.

కేసీఆర్ చేతిలో పదేళ్లు తెలంగాణ తల్లి బలయిందన్నారు. సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారని... మనం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేశామన్నారు. ఏం పోయే కాలం వచ్చిందో కేసీఆర్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. నాడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే ఆ ఇళ్లు డబ్బాలు అన్న కేసీఆర్ ఇన్నేళ్లలో ఇచ్చిన డబుల్ బెడ్రూంలు ఎన్ని అని ప్రశ్నించారు.

కేసీఆర్ తన బిడ్డ కోసం బీజేపీని గెలిపించాలనుకుంటున్నారని ఆరోపించారు. జహీరాబాద్‌కు ఫార్మా సిటీని తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని హెచ్చరించారు. మోదీ, అమిత్ షాలు కలిసి రిజర్వేషన్లను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. రిజర్వేషన్ల రద్దు బీజేపీ విధానం అన్నారు.

  • Loading...

More Telugu News