Pawan Kalyan: రామచంద్రపురంకు లేటుగా వచ్చిన పవన్ కల్యాణ్... కొన్ని నిమిషాల ప్రసంగంతో సభ ముగింపు
- ఈ సాయంత్రం రాజోలులో వారాహి సభ
- అక్కడ్నించి రామచంద్రపురం రావడానికి మూడు గంటలు పట్టిందన్న పవన్
- 10 గంటల తర్వాత తాను బయట కనిపించకూడదని వెల్లడి
- ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని నిమిషాలే ప్రసంగిస్తానన్న జనసేనాని
జనసేనాని పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో వారాహి సభ అనంతరం రాత్రి రామచంద్రపురం నియోజకవర్గంలో సభకు హాజరవ్వాల్సి ఉంది. అయితే, ఆయన నిర్ణీత సమయం కంటే చాలా ఆలస్యంగా సభకు వచ్చారు. దారి పొడవునా ప్రజల విశేష స్పందన కారణంగా రామచంద్రపురం చేరుకోవడానికి 3 గంటల సమయం పట్టిందని, తాను ఇక్కడికి 9.50 గంటలకు వచ్చానని, ఎన్నికల్ కోడ్ కారణంగా రాత్రి 10 తర్వాత తాను బయట కనిపించకూడదని వివరణ ఇచ్చారు.
"రామచంద్రపురం వాడి వేడి ఇప్పుడర్థమైంది. ఎన్నికల నియామవళి కారణంగా నేను నిర్ణీత సమయం దాటి ప్రసంగించలేకపోతున్నాను. కుదిరితే మరోసారి ఇక్కడికి వస్తాను. ఒకటే మాట... ప్రభుత్వ మారబోతోంది, మన ప్రభుత్వం వస్తోంది... వైసీపీ అవినీతి కోటను బద్దలు కొడుతున్నాం.
ఒకటే మాట... కులాలను కలపాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. అవకాశం ఉన్నప్పుడు గొడవపెట్టుకుని, ఇవాళ మళ్లీ రాజకీయాల కోసం కలుపుకోవడం మంచిది కాదు. వదులుకోకూడదు. యువతరానికి ఏం సంపద విడిచిపెట్టాం... యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప... గాయాలు, వేదనలు, బాధలు తప్ప! సంపద వైసీపీకి, కష్టాలు మనకా? మనల్ని దోపిడీ చేసి వాళ్లు అందలం ఎక్కుతున్నారు.
మీలో ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది. నేను మీకు అండగా ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి, మీకోసం నేను పనిచేస్తాను.
రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన పోటీ చేయాల్సింది. కానీ కూటమి నిర్ణయం ప్రకారం ఈ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేశాం. ఎందుకంటే 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నట్టే, 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టే.
రామచంద్రపురం నుంచి టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ గారిని మనస్ఫూర్తిగా గెలిపించమని కోరుతున్నాను. అలాగే, అమలాపురం పార్లమెంటు అభ్యర్థిగా జీఎం హరీశ్ ను గెలిపించాలి. పిఠాపురంలో మనం గెలవబోతున్నాం... అక్కడ మనకు టీడీపీ సంపూర్ణ సహకారం అందిస్తోంది. మనం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు జనసేన పార్టీ శ్రేణులు మద్దతుగా నిలవాలి. మండపేట నుంచి జోగేశ్వరరావును కూడా సైకిల్ గుర్తుపై గెలిపించాలి.
నేను మండపేట వెళ్లడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇవాళ రామచంద్రపురం ప్రసంగం నాకు తృప్తినివ్వలేదు. 3 నిమిషాలు మాట్లాడడం కాదు 45 నిమిషాలు మాట్లాడాలి, ప్రతి ఒక్కరితో మనసు విప్పి మాట్లాడాలి. వీలైతే మళ్లీ వస్తాను" అని వివరించారు.