Jayam Jayam: తెలుగు చిత్ర పరిశ్రమ చెంతకు మళ్లీ ‘జయం.. జయం’
- 17 ఏళ్లుగా భక్తి భావనలు నింపుతున్న ‘జయం జయం’ గ్రంథం
- గతంలో ఈ గ్రంథంపై ప్రశంసలు కురిపించిన డాక్టర్ సినారె
- తెలుగు సినీ పెద్దలకు సెంటిమెంట్
- ఉచితంగా వితరణ చేసిన సినీ పెద్దలు
ప్రముఖ కవి పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘జయం.. జయం’ పవిత్ర గ్రంథం మళ్లీ జంటనగరాల్లోని ఆలయాలకు చేరబోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న ఈ గ్రంథం ఎన్నోసార్లు పునర్ముద్రణ జరుపుకొంది. తాజాగా, ఈ గ్రంథం మరోమారు టాలీవుడ్ చెంతకు చేరబోతున్నది. పురాణపండ పుస్తకాలు కుల విభజన రేఖలకు అతీతంగా దేవుణ్ని ప్రేమించేలా చేస్తాయని పదిహేడేళ్ల క్రితం ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పలుమార్లు ఈ పుస్తకం గురించి ప్రస్తావించారు. నాటి నుంచి ఈనాటి వరకు ఈ గ్రంథం భక్తుల హృదయాలను తాకుతూనే ఉంది.
చాలామంది సినీ ప్రముఖులకు సెంటిమెంటుగా మారిన ఈ పుస్తకాన్ని ఇప్పుడు సరికొత్త విశేషాలతో చిత్ర పరిశ్రమకు ఉచితంగా ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా గతంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ ఆఫీసు మేనేజర్ శేషగిరిరావు చాలామందికి ఈ పుస్తకాన్ని వితరణ చేసినట్టు ‘మా’ సిబ్బంది తెలిపారు. ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి కూడా వందలకొద్దీ పుస్తకాలను ఇండస్ట్రీకి అందించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఆధ్యాత్మిక సాధనా గ్రంథం సినీ పరిశ్రమ చెంతకు చేరబోతోంది.