Revanth Reddy: ఈటల గెలుస్తాడని చెప్పిన మల్లారెడ్డిని కేటీఆర్ సస్పెండ్ చేయలేదు పైగా... సమర్థించారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy asks ktr why he suspended malla reddy

  • మల్కాజ్‌గిరి నుంచి ఈటల గెలుస్తారన్న మల్లారెడ్డి
  • అత్యుత్సాహంతోనో... అమాయకంగానో మల్లారెడ్డి మాట్లాడి.. కుండ పగులగొట్టారని వ్యాఖ్య
  • మల్లారెడ్డికి కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వలేదు... వివరణ అడగలేదన్న రేవంత్ రెడ్డి
  • గంటలు గంటలు తినడానికి బకాసురుడివా? అని కేసీఆర్‌పై ఆగ్రహం

మల్కాజ్‌గిరి లోక్ సభ సీటు నుంచి ఈటల రాజేందర్ గెలుస్తారని మాట్లాడిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సమర్థించడం విడ్డూరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిన్నటికి నిన్న మల్లారెడ్డి అత్యుత్సాహంతోనో... అమాయకంగానో ఈటల రాజేందర్ గెలుస్తున్నాడని చెప్పాడని గుర్తు చేశారు. బీజేపీతో కనుక బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే వైరం ఉంటే మల్లారెడ్డిని వెంటనే కేటీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

మల్లారెడ్డిని సస్పెండ్ చేయకపోగా... ఆయన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించారని మండిపడ్డారు. గత లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి తనను ఓడించేందుకు 31 సమావేశాలు పెట్టారని... ఇప్పుడు ఒక్క సభ కూడా పెట్టలేదన్నారు. ఐదు స్థానాల్లో బీజేపీని గెలిపించడం కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మేడ్చల్ ఎమ్మెల్యే అలా మాట్లాడితే కనీసం షోకాజ్ నోటీసు ఇవ్వలేదని... వివరణ కూడా అడగలేదన్నారు. అలాంటి కేటీఆర్ బీజేపీని ఓడిస్తానని రంకెలు వేయడం విడ్డూరమన్నారు.

ఇప్పటి వరకు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లను ఏమీ అనడం లేదని, బీఆర్ఎస్ అగ్రనాయకులు కూడా ఈటలను ఏమీ అనడం లేదన్నారు.

బకాసురుడివా గంటలు గంటలు తినడానికి?

తాను మహబూబ్ నగర్‌లో తింటుంటే రెండుసార్లు కరెంట్ పోయిందని కేసీఆర్ చెబుతున్నారని... గంటలు గంటలు తినడానికి ఆయన ఏమైనా బకాసురుడా? అని ఎద్దేవా చేశారు. ఇదివరకు సూర్యాపేటలోనూ ఇలాగే చెప్పారని మండిపడ్డారు. కేసీఆర్ ఇన్ని అబద్దాలు ఆడటం ఎందుకని ప్రశ్నించారు. తాము వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసినందుకు తిడుతున్నారా? అని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీని ఏమనకుండా కష్టపడుతున్న తమను ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. జైల్లో ఉన్న కూతురు కోసం బీజేపీతో అంటకాగారన్నారు. అధికారంలో లేకుంటే చస్తామా? ఏమిటి అన్నారు.

  • Loading...

More Telugu News