Pawan Kalyan: ప్రజారాజ్యం పార్టీ విలీనానికి ఈ ఎమ్మెల్యేనే మూలకారకుడు: పవన్ కల్యాణ్
- కాకినాడ రూరల్ లో వారాహి విజయభేరి సభ
- హాజరైన పవన్ కల్యాణ్
- కురసాల కన్నబాబుకు, తనకు ప్రత్యేక సంబంధం ఉందని వెల్లడి
- తమ వద్ద డొక్కు స్కూటర్ పై తిరుగుతుండేవాడని వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం కాకినాడ రూరల్ లో ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు, తనకు ప్రత్యేక సంబంధం ఉందని అన్నారు.
"గత దశాబ్దకాలంగా నేను రోడ్ల మీద తిరుగుతూ, నలుగుతూ ఉన్నానంటే దాని వెనుక కారణం ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. పార్టీలో నేను వ్యవస్థాపక సభ్యుడ్ని... పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి మూలకారకుడు కురసాల కన్నబాబే.
ప్రజారాజ్యం పార్టీ పెట్టాలని 2008లో నిర్ణయం తీసుకున్నప్పుడే చెప్పాను... నేను ప్రజల కోసం రోడ్ల మీదకు వస్తాను, తిరుగుతాను అని చెప్పాను. ఆ మాటకు నేను ఇప్పటికీ కట్టుబడే ఉన్నాను. కురసాల కన్నబాబు ఒక డొక్కు స్కూటర్ లో మా వద్ద తిరుగుతుండేవాడు. కన్నబాబు... ఇలా రా... అంటే పరిగెత్తుకుని వచ్చేవాడు. చిరంజీవికి గారికి ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చే వ్యక్తి, అంచెలంచెలుగా ఎదిగాడు.
నాయకులుగా ఎదగడాన్ని మేం వ్యతిరేకించం... మేమేమీ అభ్యంతరం పెట్టం. నాయకులుగా ఎదగాలి కూడా. కానీ నువ్వు ఎవరిని తొక్కేసి నాయకుడిగా ఎదుగుతున్నావన్నదే ముఖ్యం.
కాకినాడ ప్రాంతంలో శెట్టిబలిజలు, మత్స్యకారుల సామాజికవర్గాలు బలంగా ఉన్నాయి. నేను అన్ని కులాలకు సమ ప్రాధాన్యత ఇస్తాను. నేను ఒక కులానికి చెందిన వ్యక్తిని కాను. నేను ఒక కులానికి చెందినవాడ్ని అయితే కులనేతను అయిపోతాను... కానీ నేను ఒక పార్టీకి అధినేతను. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అని కోరుకునే వ్యక్తిని.
టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నేను ఏ పార్టీ అని ఆలోచించలేదు. రాష్ట్రం బాగుండాలి... దీనికి ఒక నాయకత్వం సరిపోదు, చాలామంది నాయకులు ఏకతాటిపైకి రావాలి, అనుభవజ్ఞులైన నాయకులు ఉండాలి అని దీర్ఘంగా ఆలోచించాను. నలిగిపోతూ, కుమిలిపోతూ ఉన్న తెలుగుదేశం క్యాడర్ కు జనసేన అండగా ఉంది అని రాజమండ్రి వచ్చి భుజం కాశాను. పొత్తులో భాగంగా చంద్రబాబు, బీజేపీ, మేం అందరం త్యాగాలు చేశాం" అని పవన్ కల్యాణ్ వివరించారు.