Chandrababu: జగన్ చేతులెత్తేశాడు... ఆ మేనిఫెస్టోలో ఏమీ లేదు: కోవూరు సభలో చంద్రబాబు

Chandrababu says there is nothing in YCP Manifesto

  • నెల్లూరు జిల్లా కోవూరులో ప్రజాగళం సభ
  • వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డిల తరఫున చంద్రబాబు ప్రచారం
  • మేనిఫెస్టో అంటూ జగన్ రాజీనామా చేసేశాడన్న చంద్రబాబు
  • ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం చేశాడంటూ ఎద్దేవా

టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కోవూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఇటీవలే టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతుల తరఫున ప్రచారం చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తున్నారు. 

కోవూరు సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ఈసారి ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయం, సైకో జగన్ మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. దానికితోడు ఇవాళ మేనిఫెస్టో అంటూ రాజీనామా కూడా చేసేశాడని, రాజకీయాలకు అస్త్రసన్యాసం చేశాడని ఎద్దేవా చేశారు. 

మన సూపర్ సిక్స్ ముందు జగన్ మేనిఫెస్టో వెలవెలబోయిందని, అందులో అసలేమైనా ఉందా అని ప్రశ్నించారు. యువతకు, రైతులకు, మహిళలకు ఏమైనా చెప్పాడా అని ప్రశ్నించారు. ఇక నా వల్ల కాదు, దోచుకున్నంత దోచుకున్నా, దాచుకున్నంత దాచుకున్నా... ఇప్పుడు చేతులెత్తేస్తున్నా అని చెప్పి చేతులెత్తేసిన వ్యక్తి జగన్ అని వ్యంగ్యం ప్రదర్శించారు. 

"ఇవాళ ప్రజాసేవ చేయాలని వచ్చిన వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. సేవ ద్వారానే పేరు తెచ్చుకోవాలని వారు కోరుకున్నారు. కానీ ఇక్కడొక ఎమ్మెల్యే (నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి) ఉన్నాడు. తండ్రి చనిపోతే అతడ్ని నేనే ఎమ్మెల్యేగా చేశాను. 

ఆ విధంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఈ నియోజకవర్గానికే ఒక సవాలుగా తయారయ్యాడు. ఆ సవాలుకు సరైన మెడిసిన్... ప్రశాంతి రెడ్డి గారు. రాజకీయం అంటే దోపిడీ అనేది జగన్, ప్రసన్నకుమార్ రెడ్డి సిద్ధాంతం. రాజకీయాలంటే సేవ, సమాజానికి మంచి చేయాలనేది వేమిరెడ్డి కుటుంబం సిద్ధాంతం. 

ప్రశాంతిరెడ్డిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే ఆమె పారిపోతుందని భావించారు. కానీ ఆమె పారిపోదు... వీళ్లనే పారదోలుతుంది. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, పద్దతి ఉండాలి, విలువలు ఉండాలి. ఈ విలువలను పేటీఎం బ్యాచ్ తుంగలో తొక్కుతున్నారు. కుక్కల మాదిరిగా మొరుగుతున్నారు... కుక్కలు మొరిగితే ఏనుగు భయపడుతుందా? ఈ చిల్లర రాజకీయనేతలను ఇంటికి పంపించాలి... మీరందరూ సిద్ధమా? 

ఈ అసెంబ్లీ కౌరవ సభ అని నాడే చెప్పాను... మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసి వచ్చాను. పెద్ద ఎత్తున అప్పులు చేసి నవరత్నాలు అన్నాడు... నవమోసాలు చేశాడు. ఇప్పుడు చేతులెత్తేశాడు. ఆదాయం వచ్చే మార్గాలన్నీ మూసివేశాడు" అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.

  • Loading...

More Telugu News