Pawan Kalyan: ప్రతి వైసీపీ గూండాని మోకాళ్లపై నడిపిస్తాం: పెద్దాపురంలో పవన్ కల్యాణ్
- కాకినాడ జిల్లా పెద్దాపురంలో వారాహి విజయభేరి సభ
- వచ్చేది కూటమి ప్రభుత్వమేనన్న పవన్ కల్యాణ్
- సింహం శక్తి లేకే సింగిల్ గా వస్తుందని వెల్లడి
- సివంగులు (ఆడసింహాలు) వేటాడి తెస్తేనే సింహం తింటుందని వివరణ
కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. పవన్ ప్రసంగిస్తూ, వైసీపీ అరాచకాలకు ఈ ఎన్నికలతో అడ్డుకట్ట పడుతుందని, జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి వైసీపీ గూండాని మోకాళ్లపై నడిపించే పరిస్థితి తీసుకొస్తామని హెచ్చరించారు.
ద్వారంపూడి చంద్రశేఖర్, దొరబాబు వనరుల దోపిడీకి పాల్పడ్డారని, అక్రమ మైనింగ్ కొండలు కాస్తా మైదానాలలా మారిపోయాయని అన్నారు. ఇళ్ల పట్టాల స్కాంలో రూపాయి విలువ చేయని భూములను కూడా ప్రభుత్వంతో వంద రూపాయలకు కొనిపించారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల లబ్దిదారులు 5 శాతం మందేనని, కానీ సాక్షి పత్రికలో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని, సిద్ధం పోస్టర్లు, హోర్డింగులు వేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
రాష్ట్రంలో ఎక్కడా టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా ఇళ్లను పాడుపెట్టారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన వ్యక్తి మీ ఆరోగ్యాలను పణంగా పెట్టి రూ.41 వేల కోట్లు దోచుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నాడు జగన్ కాపు రిజర్వేషన్ల గురించి గట్టిగా చెప్పాడు. ఏదైనా ఒక సమస్య గురించి మాట్లాడినప్పుడు దానిపై బలంగా నిలబడాలి. వాళ్లందరూ కూర్చుని కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవదీశారు. ఒక సమస్యను లేవనెత్తినప్పుడు దానికి పరిష్కారం లేకపోతే ఇంతమంది యువతను రెచ్చగొట్టకూడదు. ఆ రోజు తుని ఘటనలో ఎంతమంది రైల్వే కేసుల్లో నలిగిపోయారు?
జగన్ కు మద్దతుగా నిలిచిన వ్యక్తులు నన్ను ఎన్ని మాటలు అన్నారు? దశాబ్దకాలంగా నన్ను తూట్లు పొడిచారు. ఈ మాటలు పడాల్సిన అవసరం నాకేం ఉంది? కాపు రిజర్వేషన్లు ఇవ్వను అని జగన్ చెప్పాడు... సంతోషం. కానీ కాపు సామాజికవర్గం అతడికి ఓటేసింది. కాపు సామాజికవర్గం అంతా ఓటేయకపోతే జగన్ గెలవడు. ఇవాళ కాపు సామాజిక వర్గం కూడా ఆలోచించాలి, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు ఆలోచించాలి. జగన్ కు ఎందుకు ఓటెయ్యాలి?
కాపు రిజర్వేషన్లు ఇవ్వొచ్చు, ఇవ్వకపోవచ్చు... కరాఖండీగా చెప్పిన వ్యక్తికి, వైసీపీకి కాపు సామాజిక వర్గ నేతలు ఎలా మద్దతుగా నిలిచారు? చలమలశెట్టి సునీల్ ఎంపీగా పోటీ చేస్తుంటే, నీకు ఎందుకు ఓటెయ్యాలని కాపు నేతలు అడగాలి. ప్రతి ఒక్క సామాజిక వర్గం వైసీపీ వారిని నిలదీయాలి. ఇప్పుడు గనుక మార్పు తీసుకురాకపోతే ఇంకెప్పుడూ మార్పు రాదు.
తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు... ఆయనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చలమలశెట్టి సునీల్ లాగా ప్రతి ఐదేళ్లకోసారి పార్టీ మారే వ్యక్తి కాదు. ఇక్కడ నిమ్మకాయల చినరాజప్పను చూసి నేర్చుకోవాలి. ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తి ఆయన. నేను కూడా పార్టీ పెట్టాను, అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నాను... కానీ పార్టీని వదల్లేదు. చలమలశెట్టి సునీల్ అలాకాదు... ఏ పార్టీలో బాగుంటే అక్కడికి వెళ్లిపోతాడు. ఒకటే సంకేతం... అతడు ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీ ఓడిపోతుంది. ఇప్పుడు ఓటమి చెందే వైసీపీలోకి వెళ్లాడు.
మేం ఇవాళ గట్టిగా పోరాడుతున్నాం. ఒకవైపు రాయలసీమ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, మరోవైపు చంద్రబాబు, ఇంకోవైపు నుంచి నేను... ఇంతమంది బలంగా నిలబడ్డాం. అదే జగన్ మాత్రం ఒక్కడే లింగులిటుకుమంటూ ఒక్కడే తిరుగుతున్నాడు. అదేమంటే సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నాడు.
సింహం ఎప్పుడూ వేటాడదు... సివంగులు (ఆడసింహాలు) వేటాడి తెస్తే సింహం అప్పుడు తింటుంది. సింహం సింగిల్ గా వస్తుంది అంటే... దానికి బలం పోయి, శక్తిలేక సింగిల్ గా వస్తుంది.
నేను సజ్జలకు కూడా ఒకటే చెప్పా... ఇది జంతు ప్రపంచం కాదు, ఇది మానవ ప్రపంచం. ఇది ఆంధ్రా నేల. అన్యాయానికి గురైనవాళ్లు, ఆక్రోశిస్తున్న వాళ్లు, తిరుగుబాటు చేసే వాళ్లు కూటమిగా ఏర్పడ్డారు. వైసీపీ వాళ్లను కిందికి లాక్కొచ్చి మన పెద్దాపురం రోడ్లపై నడిపిద్దాం" అంటూ పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.