Varun Tej: బాబాయ్ పవన్ కల్యాణ్ కోసం రంగంలోకి దిగిన వరుణ్ తేజ్
- పవన్‌కు మద్దతుగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేసిన వరుణ్ తేజ్
- అప్పులు చేసి మరీ రైతులకు పవన్ సాయం చేస్తున్నాడని ప్రస్తావన
- ఈ ఎన్నికల్లో గెలిస్తే మరింత సేవ చేస్తాడని ఓటర్లను కోరిన వరుణ్ తేజ్
తన బాబాయ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కోసం సినీ నటుడు వరుణ్ తేజ్ రంగంలోకి దిగాడు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. జనసేనాని పవన్ కల్యాణ్‌కు ప్రజలే కుటుంబ సభ్యులని వరుణ్ తేజ్ అన్నాడు. 2019 ఎన్నికల్లో పవన్ విజయం సాధించకపోయినా ఆయన ప్రజలకు మేలు చేస్తూనే ఉన్నారని ప్రస్తావించాడు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు ఆయన మరింత సేవ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. పవన్ కల్యాణ్ అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నారని గుర్తుచేశాడు. ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ కోరాడు.
గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చెందుర్తి గ్రామాలలో బైకు ర్యాలీ, రోడ్డు షోలో వరుణ్ తేజ్ పాల్గొన్నాడు. దుర్గాడలో బహిరంగ సభలో మాట్లాడాడు. కాగా అంతకుముందు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకున్న వరుణ్ తేజ్‌కి రాజమండ్రి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తండ్రి నాగబాబు సహా పలువురు నేతలు ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆహ్వానించారు. మరోవైపు రాజమండ్రి నుంచి పిఠాపురం చేరుకున్న వరుణ్‌కు అక్కడ కూడా భారీ స్వాగతం లభించింది. జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మరోవైపు నాగబాబు, వరుణ్ ఇద్దరూ పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.