Ambati Rayudu: వైసీపీకి రాజీనామా చేయడంపై క్లారిటీ ఇచ్చిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
- ప్రజాసేవకు వైసీపీ వేదిక కాదనిపించింది.. అందుకే వెంటనే బయటకు వచ్చేశానన్న రాయుడు
- పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి జనసేనలో చేరానని వెల్లడి
- రాష్ట్ర ప్రగతి కోసం ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని కోరిన అంబటి రాయుడు
- గుంటూరు జిల్లా తెనాలిలో రాయుడు పర్యటన
గతంలో వైఎస్సార్సీపీలోకి వెళ్లినప్పటికీ అక్కడి వాతావరణం చూశాక ప్రజాసేవకు ఇది వేదిక కాదనిపించిందని, అందుకే వెంటనే బయటకు వచ్చేశానని భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించాడు. జనసేనాని పవన్ కల్యాణ్ నాయకత్వం, ఆయన ఆశయాలు నచ్చి జనసేన పార్టీలోకి వచ్చానని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్యేలు సైతం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసే పరిస్థితి ఉండదని రాయుడు విమర్శించాడు. రాచరికం, ఆధిపత్య ధోరణి తరహాలోనే ఆ పార్టీ పాలన సాగిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతి, యువతకు ఉపాధి కోసం ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరముందని ఓటర్లను కోరారు. ప్రతి ఓటు సద్వినియోగం కావాలని ఓటర్లను ఆయన కోరారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో శనివారం ఆయన పర్యటించారు. కాగా అంబటి రాయుడు వైసీపీలో చేరిన తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. వైసీపీ తరపున గుంటూరు ఎంపీ టికెట్‌ను ఆయన ఆశించారని, అయితే వైసీపీ మొండిచెయ్యి చూపించడంతో రాయుడు ఆ పార్టీ నుంచి బయటకొచ్చారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.