YS Sharmila: జగన్ ఆదేశాలతోనే అక్రమాస్తుల కేసు ఎఫ్ఐఆర్‌లో వైఎస్సార్ పేరు.. చేర్చిన వ్యక్తికి ఏఏజీ పదవి: షర్మిల
- వైఎస్సార్ పేరును చేర్చింది పొన్నవోలు సుధాకర్‌రెడ్డేనన్న షర్మిల
- సీఎం అయిన ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ పదవి కట్టబెట్టారని ఆరోపణ
- తండ్రి పేరును చార్జ్‌షీట్‌లోకి ఎక్కించిన వ్యక్తికి హడావుడిగా ఆ పదవి ఎందుకిచ్చారని నిలదీత
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు విరుచుకుపడ్డారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును సీబీఐ తొలుత చేర్చలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత జగన్ ఆదేశాలతోనే ఎఫ్ఐఆర్‌లోకి ఆయన పేరు ఎక్కిందని తెలిపారు. విశాఖపట్టణంలో మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ జగన్ ఆదేశాలతో వైఎస్సార్ పేరును పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చేర్చారని ఆరోపించారు.
ఈ కేసు నుంచి జగన్‌ను బయటపడేసేందుకు ఇలా ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత జగన్ సీఎం పదవి చేపట్టిన ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ పదవి దక్కిందని తెలిపారు. వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధమూ లేకపోతే హడావుడిగా ఏఏజీ పదవిని ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని షర్మిల ప్రశ్నించారు.