Kodi Kathi Case: టీడీపీలో చేరిన కోడికత్తి శ్రీను.. జగన్‌ను సీఎం చేసే ప్రయత్నం వల్ల ఐదేళ్లు జైలులో మగ్గిపోయానని ఆవేదన
- తన అన్న కుటుంబం, ఎస్సీ కుటుంబాలతో కలిసి కూటమి అభ్యర్థి బుచ్చిబాబు సమక్షంలో చేరిక
- స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా పరిస్థితులు అనుకూలించలేదని ఆవేదన
- వైసీపీ తప్ప అన్ని పార్టీల నుంచి మద్దతు లభించిందన్న శ్రీనివాస్
- తన విడుదలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్న శ్రీను
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిలుపై బయటకు వచ్చిన కోడికత్తి శ్రీను కుటుంబంతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించానని, పరిస్థితులు అందుకు అనుకూలించకపోవడంతో టీడీపీలో చేరినట్టు శ్రీను తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నం వల్ల తాను ఐదేళ్లు జైలులో మగ్గిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభించిందని, అయితే తాను అభిమానించిన వైసీపీ నుంచి మాత్రం ఎవరూ సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ రోజు బతికి ఉండడానికి ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాలే కారణమన్న ఆయన.. తన విడుదలకు కారణమైన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.
కోనసీమ జిల్లాలోని ఠాణేలంకకు చెందిన జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను.. తన అన్న సుబ్బరాజు కుటుంబంతోపాటు గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాలతో కలిసి కూటమి అభ్యర్థి బుచ్చిబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. బుచ్చిబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.