Pet Cat: అమెజాన్ రిటర్న్ ప్యాకేజీలో పెంపుడు పిల్లి.. ఆరు రోజుల తర్వాత ఆచూకీ
- బాక్స్ లో పడిన పిల్లిని గుర్తించకుండా ప్యాక్ చేసిన మహిళ
- ప్రేమగా పెంచుకుంటున్న పిల్లి కనిపించకపోవడంతో అమెరికాలో ఓ జంట ఆందోళన
- వీధుల్లో పోస్టర్లు అతికించి మరీ గాలింపు
- 800 మైళ్ల దూరంలోని కాలిఫోర్నియాలో దొరికిన పిల్లి ఆచూకీ
అమెజాన్ లో కొన్న వస్తువు నచ్చకపోవడంతో వాపస్ పంపించేందుకు ప్యాక్ చేశారా దంపతులు.. కొరియర్ కంపెనీలో ఆ బాక్స్ ఇచ్చేసి ఆఫీసులకు వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాక ప్రేమగా ఎదురొచ్చే పెంపుడు పిల్లి కనిపించలేదు. ఇంట్లో, చుట్టుపక్కల వాళ్ల ఇళ్లల్లో వెతికినా దొరకలేదు. పిల్లి కనిపించట్లేదని పోస్టర్లు అంటించి మరీ గాలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, ఆరు రోజుల తర్వాత తమ పిల్లికి అమర్చిన మైక్రో చిప్ స్కాన్ చేసినట్లు ఆ దంపతుల మొబైల్ కు నోటిఫికేషన్ వచ్చింది. అదేరోజు సాయంత్రం ఓ వెటర్నరీ డాక్టర్ ఫోన్ చేసి పిల్లి తన దగ్గర క్షేమంగా ఉందని చెప్పారు. అమెజాన్ కు రిటర్న్ పంపించిన బాక్స్ లో పొరపాటున పిల్లి కూడా వెళ్లిందని తెలిసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. ఆరు రోజుల పాటు తిండి నీళ్లు లేకున్నా అది ప్రాణాలతో ఉండడంపై వెటర్నరీ డాక్టర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
యుటా నుంచి కాలిఫోర్నియాకు..
అమెజాన్ లో డెలివరీ అందుకున్న ఓ వస్తువును క్యారీ క్లార్క్ అనే మహిళ వాపస్ చేసింది. సదరు వస్తువు పనితీరు బాలేదని చెబుతూ రిటర్న్ పంపించింది. అయితే, భర్తతో కలిసి దానిని ప్యాక్ చేస్తూ లోపల పడుకున్న పిల్లిని గుర్తించలేదు. దీంతో ఆ పిల్లి కూడా బాక్స్ తో పాటే వెళ్లిపోయింది. ఆరు రోజుల ప్రయాణం తర్వాత యుటా నుంచి కాలిఫోర్నియాలోని అమెజాన్ గోడౌన్ కు చేరింది. బాక్స్ విప్పిన ఓ ఉద్యోగి అందులో నీరసంగా పడుకున్న పిల్లిని గుర్తించి హుటాహుటిన వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఇదిలా ఉండగా.. అక్కడ యుటాలోని దంపతులు తమ పెంపుడు పిల్లి కనిపించక ఇంటాబయటా తీవ్రంగా వెతుకుతున్నారు. పోస్టర్లు అంటిస్తూ వీధులన్నీ గాలిస్తున్నారు.
పిల్లి కనిపించకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కాలిఫోర్నియాలో పిల్లికి చికిత్స చేసిన డాక్టర్.. దానికి అమర్చిన మైక్రోచిప్ ను స్కాన్ చేసి యజమానులకు సంబంధించిన వివరాలు తెలుసుకుని క్యారీ క్లార్క్ కు ఫోన్ చేశాడు. యుటాలోని తన ఇంట్లో కనిపించకుండా పోయిన పిల్లి కాలిఫోర్నియాలో కనిపించడమేంటని తొలుత అనుమానించిన క్లార్క్.. తన పిల్లి ఫొటోలు పంపడంతో ఆశ్చర్య పోయింది. రెండు నగరాల మధ్య దాదాపు 800 మైళ్ల దూరం ఉండడంతో తన పిల్లి అక్కడికి ఎలా చేరిందో అర్థంకాలేదని చెప్పింది. పిల్లి క్షేమంగా ఉందని తెలియడంతో క్లార్క్ సంతోషం పట్టలేకపోయింది. మరుసటి రోజే కాలిఫోర్నియాకు వెళ్లి తన పెంపుడు పిల్లిని చేతుల్లోకి తీసుకుంది.