prajwal revanna: అసభ్యకర వీడియోల కేసులో చిక్కుకోవడంతో విదేశాలకు దేవెగౌడ మనవడు

prajwal revanna travels to frankfurt amid obscene videos row

  • బెంగళూరు నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు ప్రజ్వల్ రేవణ్ణ పయనం
  • ఆ వీడియోలపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తామన్న కర్ణాటక ప్రభుత్వం
  • ఈ నేపథ్యంలో హడావిడిగా విదేశీ ప్రయాణం


కర్ణాటకలో సంచలనం సృష్టించిన అసభ్య వీడియోల కేసులో చిక్కుకోవడంతో మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత అయిన దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ దేశం వీడారు. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్‌ ఫర్ట్‌ కు పయనమయ్యారు. ఈ వీడియోలపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆయన దేశం వీడటం గమనార్హం. 

కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా హసన్‌ జిల్లాలో ఇవి ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీనిపై స్పందించారు. నిజానిజాలు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మహిళపై లైంగిక వేధింపుల కోణాన్ని కూడా ఈ కేసులో దర్యాప్తు చేస్తామన్నారు. 

అయితే రేవణ్ణ పేరుప్రతిష్టలను దెబ్బతీసేందుకే కొందరు ఈ క్లిప్‌లను వ్యాప్తి చేశారని జేడీఎస్‌-బీజేపీ ఎన్నికల ఏజెంట్‌ పూర్ణచంద్ర గౌడ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది ఒక మార్ఫింగ్ వీడియో అని అందులో పేర్కొన్నారు. హసన్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నవీన్‌ గౌడ అనే వ్యక్తితోపాటు మరికొందరు దాన్ని వైరల్ చేశారని చెప్పారు. రేవణ్ణకు ఓటేయద్దని కూడా వారు కోరినట్లు ఫిర్యాదులో వివరించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ ఈ అంశంపై దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు.

హసన్‌ నియోజకవర్గం దేవెగౌడ ఫ్యామిలీకి కంచుకోట. రాజకీయంగా పుట్టస్వామి కుటుంబంపై దేవెగౌడ కుటుంబానిదే ఆధిపత్యం. 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి హొళెనరసిపుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్‌.డి.రేవణ్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు ఎస్‌.జి.అనుపమ సైతం ఓడిపోయారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి మనవడు శ్రేయస్‌ పటేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన 3,152 ఓట్ల తేడాతో రేవణ్ణ చేతిలో ఓటమిపాలయ్యారు. తాజాగా లోక్ సభ ఎన్నికల్లో ఇరు కుటుంబాలకు చెందిన వారే మళ్లీ తలపడుతున్నారు.

  • Loading...

More Telugu News