Nara Lokesh: ఈ నెల 30 నుంచి నారా లోకేశ్ సుడిగాలి పర్యటన

Nara Lokesh tour will commence from April 30

  • యువగళం పాదయాత్రను విజయవంతంగా నిర్వహించిన లోకేశ్
  • ఈ నెలాఖరు నుంచి ఎన్నికల కదనరంగంలోకి అడుగుపెట్టనున్న టీడీపీ యువనేత
  • యువతను ఎన్నికలకు సంసిద్ధం చేయడమే లక్ష్యంగా పర్యటన

ఎన్నికల దిశగా ప్రజలను చైతన్యం చేస్తూ యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 3,132 కి.మీ.ల మేర పాదయాత్ర చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... ఈనెల 30 నుంచి ఎన్నికల కదనరంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. 

ఎన్నికలకు యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా లోకేశ్ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వారం రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఏప్రిల్ 30న ఒంగోలులో ప్రారంభం కానున్న లోకేశ్ పర్యటన... మే 6న ఏలూరు వరకు కొనసాగనుంది. 

ఈనెల 30న ఒంగోలు, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరులో యువగళం సభలు కొనసాగుతాయి. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యువతతో సాగే ముఖాముఖి సమావేశాల్లో యువతీయువకుల సందేహాలను లోకేశ్ నివృత్తి చేస్తారు. 

యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్ యువతతో నిర్వహించిన 'హలో లోకేశ్' కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అదే తరహాలో కొనసాగే యువగళం సభలకు భారీ ఎత్తున యువతీయువకులు హాజరయ్యే అవకాశం ఉండటంతో కూటమి ఆధ్వర్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రతిరోజూ ఓ పార్లమెంటు కేంద్రంలో నిర్వహించే ఈ ముఖాముఖి సమావేశాల్లో... రాబోయే ఎన్నికల్లో యువత నెరవేర్చాల్సిన బాధ్యతపై దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు తాము ఏ విధంగా భరోసా కల్పిస్తామో లోకేశ్ వివరిస్తారు. 

ప్రతిఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల ద్వారా అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఉద్యోగం వచ్చేవరకు యువగళం పేరుతో ప్రతినెలా 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి వంటి హామీలపై యువతకు అవగాహన కల్పిస్తారు.

  • Loading...

More Telugu News