Pawan Kalyan: ప్రధాని దగ్గర నేను ధైర్యంగా మాట్లాగలను.... జగన్ మాట్లాడగలడా?: ఏలేశ్వరంలో పవన్ కల్యాణ్
- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వారాహి విజయభేరి సభ
- కేసుల గురించి మాట్లాడడానికే జగన్ ప్రధాని వద్దకు వెళతారన్న పవన్
- మోదీ అలాంటి వారికి గౌరవం ఇవ్వరని వెల్లడి
- జగన్ వంటి వ్యక్తులను ప్రధాని కచ్చితంగా శిక్షిస్తారని వ్యాఖ్యలు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... జగన్ వంటి వ్యక్తులు వారిపై ఉన్న కేసుల గురించి మాట్లాడడానికి, అనంతబాబు వంటి హత్య చేసిన వ్యక్తుల గురించి మాట్లాడడానికే ప్రధాని మోదీ వద్దకు వెళతారని విమర్శించారు.
కానీ మోదీ అలాంటి వారికి గౌరవం ఇవ్వరని, కానీ తాను వెళితే మోదీ ఎంతో గౌరవం ఇస్తారని పవన్ వెల్లడించారు. ప్రధాని మోదీ వద్ద తాను ధైర్యంగా మాట్లాడగలనని, మోదీ వద్ద మాట్లాడాలంటే జగన్ కు భయం అని ఎద్దేవా చేశారు. జగన్ వంటి వ్యక్తులను మోదీ కచ్చితంగా శిక్షిస్తారని పవన్ పేర్కొన్నారు.
తనకు లంచాల సొమ్ము, అవినీతి సొమ్ము అవసరం లేదని, తాను ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయని అన్నారు. యువతకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే యువత జీవితాలు బాగుపడతాయని అన్నారు.
14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు, మూడున్నరేళ్లు సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి మన కూటమిలో ఉన్నారు... దశాబ్దకాలంగా పోరాడుతున్న నేను ఉన్నాను... మాకు అండగా నిలబడండి... రాష్ట్రం కోసం పనిచేసే బాధ్యత తీసుకుంటాం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.