KCR: కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేసుకున్నారు: కేసీఆర్
- వరంగల్, హన్మకొండలో బీఆర్ఎస్ రోడ్ షో
- హాజరైన కేసీఆర్
- కడియం శ్రీహరి పార్టీ మారడంపై ప్రశ్నించిన బీఆర్ఎస్ అధినేత
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్, హన్మకొండలో నిర్వహించిన రోడ్ షోకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కడియం శ్రీహరిపై ధ్వజమెత్తారు. స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఒకాయనకు టికెట్ ఇచ్చాం, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాం... కానీ ఇప్పుడు ఎందుకు పార్టీ మారాడు? కడియం శ్రీహరి తన రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేసుకున్నాడు అంటూ వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి, మరో మూడు నెలల్లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయం అని, మన రాజయ్య ఎమ్మెల్యే అవడం తథ్యం అని కేసీఆర్ పేర్కొన్నారు. రాజయ్య గెలుపు ద్రోహులకు గుణపాఠం అవుతుందని అన్నారు.
ఇక, సీఎం రేవంత్ రెడ్డి జైళ్ల పేరు చెప్పి బెదిరిస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని కేసీఆర్ స్పష్టం చేశారు. నేను జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విపక్షాలపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.