IPL 2024: సీఎస్‌కే రివేంజ్.. ఎస్ఆర్‌హెచ్ ఓటమి.. చరిత్ర సృష్టించిన చెన్నై!
- చెన్నైలో ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్
- 78 పరుగుల తేడాతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
- 4 వికెట్లు పడగొట్టి ఎస్ఆర్‌హెచ్‌ను కోలుకోని దెబ్బ తీసిన తుషార్ దేశ్‌పాండే
- 98 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు'
- ఇటీవల హైదరాబాద్ హోం గ్రౌండ్‌లో ఓటమికి చెన్నై తన సొంతగడ్డపై గెలిచి రివేంజ్ తీర్చుకున్న వైనం
- అత్యధిక సార్లు 200కు పైగా స్కోరు సాధించిన తొలి జట్టుగా సీఎస్‌కే వరల్డ్ రికార్డు
- డారిల్ మిచెల్ అరుదైన ఘనత
చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) 78 పరుగుల తేడాతో గెలిచింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. దాంతో 134 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (13), అభిషేక్ శర్మ (15) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. మార్క్రమ్ 32 రన్స్‌తో రాణించగా, హెన్రీచ్ క్లాసెన్ 20 పరుగులతో పర్వాలేదనిపించినా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 4 వికెట్లు పడగొట్టి ఎస్ఆర్‌హెచ్‌ను కోలుకోని దెబ్బ తీశాడు. పతిరన, ముస్తాఫిజుర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ రెండు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 54 బంతుల్లో 98 పరుగులు చేసిన గైక్వాడ్ ఇన్నింగ్స్‌లో 10 బౌండరీలు, 3 సిక్సులు ఉండడం విశేషం. అతనికి తోడుగా డారిల్ మిచెల్ అర్ధ శతకం (52), శివమ్ దూబే 39 (నాటౌట్) పరుగులతో రాణించారు. అటు సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే (9) మరోసారి నిరాశపరిచాడు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, జయదేవ్ ఉనద్కట్ చెరో వికెట్ తీశారు.
అనంతరం 213 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సన్ రైజర్స్ 21 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ (13), ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ (0) లను దుషార్ దేశ్‌పాండే ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపించాడు. ఈ సీజన్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (15) కూడా తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. ఆదుకుంటాడనుకున్న నితీశ్ రెడ్డి (15) విఫలమయ్యాడు. మధ్యలో మార్క్రమ్ 32 రన్స్‌తో క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా పతిరన వేసిన ఓ అద్భుతమైన బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో 85 పరుగులకే ఎస్ఆర్‌హెచ్ కీలకమైన ఐదు వికెట్లు పారేసుకుంది.
ఆ తర్వాత క్లాసెన్ (20), అబ్దుల్ సమద్ (19) కూడా చేతులెత్తేశారు. దీంతో సన్‌రైజర్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. చివరికి 18.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో చైన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇటీవల హైదరాబాద్ హోం గ్రౌండ్‌లో పరాజయానికి చెన్నై తన సొంతగడ్డపై గెలిచి రివేంజ్ తీర్చుకుంది. 98 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
చరిత్ర సృష్టించిన సీఎస్‌కే
టీ20ల్లో సీఎస్‌కే చరిత్ర సృష్టించింది. అత్యధిక సార్లు 200కు పైగా స్కోరు సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఇప్పటివరకు చెన్నై జట్టు 35 సార్లు 200 ప్లస్ స్కోర్ సాధించింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఈ ఫీట్ నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో సోమర్‌సెట్ (34), టీమిండియా (32), ఆర్‌సీబీ (31), యార్క్‌షైర్ (29), సర్రే (28) ఉన్నాయి
డారిల్ మిచెల్ అరుదైన ఘనత
చెన్నై ఆటగాడు డారిల్ మిచెల్ అరుదైన ఘనత నమోదు చేశాడు. ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న ప్లేయర్‌గా నబి (05) రికార్డును సమం చేశాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మిచెల్ 5 క్యాచ్ లు పట్టాడు. అంతకుముందు 2021లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో నబి (ఎస్ఆర్‌హెచ్) ఈ ఘనత సాధించాడు.