Sahil Khan: 4 రాష్ట్రాలు.. 5 రోజులు.. 1800 కిలోమీటర్లు.. పోలీసులకు దొరక్కుండా సాహిల్ పరుగులు

How Actor Sahil Khan Travelled 1800 km In 4 Days To Avoid Arrest
  • మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో అరెస్టైన యాక్టర్ సాహిల్ ఖాన్
  • రాష్ట్రాలు తిరుగుతూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు
  • చివరకు ఛత్తీస్ గఢ్ లో పోలీసులకు చిక్కిన బాలీవుడ్ యాక్టర్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ యాక్టర్ సాహిల్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ అరెస్టును తప్పించుకోవడానికి సాహిల్ చాలా గట్టిగానే ప్రయత్నించాడట. నాలుగు రోజులు రోడ్లపై పరుగులు తీస్తూనే ఉన్నాడట. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వివిధ ప్రయాణ సాధనాలలో తిరిగాడని, ఓవైపు పరుగులు పెడుతూనే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 25న రోడ్డెక్కిన సాహిల్.. నాలుగు రోజుల్లో ఐదు రాష్ట్రాలు తిరిగాడని, పోలీసులకు చిక్కకుండా ఏకంగా 1800 కిలోమీటర్లు ప్రయాణించాడని సమాచారం.

బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుల ప్రమేయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసులో తన పేరు కూడా బయటకు రావడంతో సాహిల్ ఖాన్ అప్రమత్తమయ్యాడు. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. సాహిల్ ను అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో వెనక్కి తగ్గారు. అయితే, ఈ నెల 25 న సాహిల్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి సాహిల్ విశ్వ ప్రయత్నమే చేశాడు. ఈ నెల 25న మహారాష్ట్ర నుంచి గోవాకు చేరుకున్న సాహిల్.. అక్కడి నుంచి కర్ణాటకలోని హుబ్బళికి, అటుపై హైదరాబాద్ కు చేరుకున్నాడు.

తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని ముఖానికి స్కార్ఫ్ చుట్టుకున్నాడు. అయితే, సాహిల్ ను ట్రాక్ చేసిన పోలీసులు ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి సాహిల్ హైదరాబాద్ నుంచి జెండా ఎత్తేసి ఛత్తీస్ గఢ్ కు పారిపోయాడు. రోడ్డు బాలేదని, రాత్రి పూట కారు నడపలేనని డ్రైవర్ చెప్పినా సాహిల్ వినిపించుకోలేదు. రాత్రికిరాత్రే జగదల్ పూర్ కు చేరుకుని ఆరాధ్య ఇంటర్నేషనల్ హోటల్ లో దిగాడు. అయినా పోలీసుల కళ్లుగప్పలేకపోయాడు. సాహిల్ ఎక్కడున్నది ఎప్పటికప్పుడు ట్రాక్ చేసిన పోలీసులు జగదల్ పూర్ లోని హోటల్ లో అతడిని అదుపులోకి తీసుకుని ముంబై తరలించారు.
Sahil Khan
Travelled 1800 km
Avoid Arrest
Mahadev betting App Case
Entertainment

More Telugu News