Bonda Uma: రాష్ట్ర సంపదను దోచుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుంది: బొండా ఉమా
- జగన్ అవినీతిని సొంత కుటుంబ సభ్యులే బయటపెడుతున్నారన్న బొండా ఉమా
- వైసీపీ పాలనలో అన్నిరంగాల్లో దోపిడీ జరిగిందన్న బీజేపీ నేత లంకా దినకర్
- సాధ్యం కాని అంశాలతో వైసీపీ మేనిఫెస్టో అంటూ జనసేన మహిళా విభాగం నేత రాయపాటి అరుణ చురకలు
అధికార వైసీపీపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మరోసారి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్ర సంపదను దోచుకోవడమే వైసీపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. అవినీతిపరుడికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. తండ్రి హయాం నుంచే డబ్బు రుచి మరిగిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు. రూ. లక్షల కోట్లు దోచుకోవడానికి దేనికైనా సిద్ధపడతారని ఫైర్ అయ్యారు. జగన్ అవినీతిని సొంత కుటుంబ సభ్యులే బయటపెడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమిగా ఏర్పడ్డామన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. విజయవాడలో బీజేపీ నేత లంకా దినకర్, జనసేన మహిళా విభాగం నేత రాయపాటి అరుణతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అప్పుల్లో ఏపీకి మొదటి స్థానం: లంకా దినకర్
బీజేపీ నేత లంకా దినకర్ మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో అన్నిరంగాల్లో దోపిడీ జరిగిందన్నారు. పవర్ ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం భారీగా దోచుకున్నారని విమర్శించారు. ల్యాండ్, శాండ్, మైన్, రెడ్ శాండల్ ఇలా అన్నింట్లో దోపిడీనే అని దుయ్యబట్టారు. జగన్ పాలనలో అప్పుల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కేంద్ర పథకాలు, ప్రాజెక్టులకు తమ స్టిక్కర్లు అంటించుకున్నారని లంకా దినకర్ విమర్శలు గుప్పించారు.
వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలు అసాధ్యాలు: రాయపాటి అరుణ
జనసేన మహిళా విభాగం నేత రాయపాటి అరుణ మాట్లాడుతూ.. సాధ్యం కాని అంశాలతో వైసీపీ మేనిఫెస్టో తీచుకొచ్చారని దుయ్యబట్టారు. ఆసుపత్రులకు బకాయిల వల్ల ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదన్నారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల రూ. 1500కోట్లు బకాయి పడిందని తెలిపారు. పాత అంబులెన్సులకు రంగులేసి కొత్తవిగా బిల్లులు పెట్టారని ఆరోపించారు.