Pothina Mahesh: జనసేన పార్టీ స్థాపించిన తర్వాతే పవన్ ఆస్తులు బాగా కొనుగోలు చేశారు: పోతిన మహేశ్
- ఇటీవల జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన వెంకట మహేశ్
- పవన్ కల్యాణ్ పై మరోసారి విమర్శనాస్త్రాలు
- పవన్ అఫిడవిట్ నిండా పచ్చి అబద్ధాలేనని ఆరోపణ
- ఐటీ అధికారులు విచారణ చేయాలంటూ వ్యాఖ్యలు
విజయవాడ పశ్చిమ టికెట్ దక్కకపోవడంతో జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన పోతిన వెంకట మహేశ్ మరోసారి పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్ నిండా పచ్చి అబద్ధాలు, మోసాల చిట్టా ఇచ్చారని అన్నారు.
2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాతే పవన్ కల్యాణ్ ఆస్తులు బాగా కొనుగోలు చేశారని, ఆయనకు సినిమా రంగం కంటే రాజకీయ రంగమే బాగా కలిసొచ్చినట్టుగా అర్థమవుతోందని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాగా లాభాలు వచ్చాయని, చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజితో ఆస్తులు కొనుగోలు చేసినట్టు స్పష్టమవుతోందని పోతిన మహేశ్ వివరించారు.
పవన్ కల్యాణ్ నటించిన గత 4 చిత్రాల్లో రెండు ఫెయిల్ అయ్యాయని, రెండు యావరేజిగా ఆడాయని తెలిపారు. అఫిడవిట్ లో ఆస్తుల విలువ రూ.90 కోట్లు అని చూపించారని, కానీ మార్కెట్ రేటును ఎక్కడా చూపించలేదని ఆరోపించారు. అసలు రేటుకు ఒక లక్ష, రెండు లక్షలు కలిపి చూపించారని... మార్కెట్ రేటు ప్రకారం ఆ ఆస్తుల విలువ రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు ఉంటుందని అన్నారు.
ఆయన విద్యార్హత టెన్త్ క్లాస్ అనేది కూడా వివాదాస్పదమేనని పోతిన మహేశ్ వెల్లడించారు. ఓ ఆస్తి విషయంలో గిఫ్ట్ ఫ్రమ్ మదర్ అని రాశారని, మరి వారి తల్లి గారు ఇచ్చారా, లేక దత్తత తల్లి ఇచ్చారా అనేది స్పష్టత లేదని తెలిపారు.
"వారి తల్లి గారికి పెన్షన్ చాలా తక్కువ వస్తుంది... గతంలో జనసేన పార్టీకి ఆమె రూ.4 లక్షలు ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున చెప్పుకున్నారు. ఇప్పుడు రూ.4 కోట్ల ఆస్తిని అది కూడా మంగళగిరిలో కొన్నారట... దీనిపై కూడా ఆయన స్పష్టత ఇవ్వాలి. ఆయన ఆదాయం రూ.114 కోట్లు, కట్టిన పన్ను రూ.67 కోట్లు, ఇచ్చిన విరాళాలు రూ.20 కోట్లు పోతే... మిగిలిన రూ.20 కోట్లతో రూ.90 కోట్ల విలువైన ఆస్తులు ఎలా కొన్నారో చెప్పాలి. సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్ లను కూడా అప్పులుగా చూపించిన అపర మేధావి ఆయన. ఆయన ఆర్థిక మోసాలకు పాల్పడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే అఫిడవిట్ మొత్తాన్ని ఒకసారి ఆదాయ పన్ను అధికారులు తనిఖీ చేయాలి. తేడా వస్తే శిక్ష కూడా వేయాలి" అని పోతిన మహేశ్ వ్యాఖ్యానించారు.